తెలంగాణ రాష్ట్రంలో యువతరానికి ప్రోత్సాహకంగా స్టార్టప్ లు పెట్టే వారికోసం ప్రభుత్వం సంకల్పించిన సరికొత్త ఆలోచన టీ హబ్ ఇప్పుడు సీమాంతరాలకు కూడా వ్యాపించింది. టీ హబ్ ద్వారా హైదరాబాదు కేంద్రంగా చేసే కార్యకలాపాలనే అమెరికానుంచి చేయడానికి వీలుగా టీ-బ్రిడ్జ్ పేరుతో ఓ కేంద్రాన్ని ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రారంభించారు. తెలంగాణకు చెందిన ఐటీ రంగ ప్రముఖులు, విదేశీ పారిశ్రామికవేత్తల సమక్షంలో ఆయన టీ బ్రిడ్జ్ ను ప్రారంభించి.. దాని ద్వారా ఆశిస్తున్న లక్ష్యాలను , దాని కార్యకలాపాల తీరు తెన్నులను వివరించారు.
స్టార్టప్ లు పెట్టదలచుకునే వారికి ఎక్కువ ప్రోత్సాహకంగా ఉండేలా, ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకుని ఎదిగేలా టీ హబ్ అనే కాన్సెప్టును హైదరాబాదులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెండో దశలో వరంగల్ లో కూడా ఇలాంటిది ప్రారంభిస్తామని అప్పట్లో కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఈలోగా అమెరికాలో తెలంగాణ యువతరం కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న నేపథ్యంలో.. అక్కడ కూడా ఒక కేంద్రం ఉండడం సబబుగా భావించి టీబ్రిడ్జ్ ను ఏర్పాటు చేశారు. అమెరికాలో ఈ కేంద్రం ఉండడం వల్ల భారత్- సిలికాన్ వేలీ మధ్య ఆలోచనల మార్పిడికి వీలుగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి పది స్టార్టప్ నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉండే లక్ష్యంతోనే ఇదంతా చేస్తున్నట్లు వివరించడం విశేషం.