వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఈమధ్య పదునైన వ్యాఖ్యలే చేస్తున్నారు. తాజాగా రాజ్యసభలో ఆయన చేసిన ప్రసంగం హాట్ టాపిక్ గా నిలిచింది. వ్యవస్థలను బిజెపి ప్రభుత్వం మ్యానేజ్ చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ అధికార బిజెపి పై విరుచుకుపడింది. గులాం నబీ ఆజాద్ విపక్షం గొంతు నొక్కినప్పుడు సభ ఎందుకంటూ విరుచుకుపడ్డారు. నేరుగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిపై విపక్షాలన్నీ వ్యతిరేకంగా గళం ఎత్తాయి. తమ ఫోన్లు ట్యాపింగ్ చేయడం సభలో గట్టిగా మాట్లాడేవారిపై సిబిఐ, ఇన్ కం టాక్స్ , ఈడీ వంటివారితో దాడులు చేయించడం ఇలా ఒకటేమిటి మోడీ సర్కార్ ఎన్ని చేయాలో అన్ని చేస్తుందంటూ ఆరోపించి మరి సభను బహిష్కరించారు కాంగ్రెస్ నేతలు.
కాంగ్రెస్ ఏమి తక్కువతినిందన్న విజయసాయి ...
దేశంలో ప్రతిష్ట్మాకం గా భావించే దర్యాప్తు సంస్థలను తమ లబ్ధికి ఉపయోగించుకుని రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోవాలని మొదట ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. తమ పార్టీ అధినేత జగన్ పైనా, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పై కాంగ్రెస్ బనాయించిన తప్పుడు కేసులు ప్రతి ఒక్కరికి తెలుసని అన్నారు ఆయన. ఇప్పడు తమదాకా వచ్చాకా కాంగ్రెస్ కి తెలిసివచ్చిందా అని ప్రశ్నించారు. ఇక ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని విభజన చట్టంలో వున్న అంశాలకు విలువ ఇవ్వకపోతే ఎలా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ తీరని కష్టాల్లో ఉందని కేంద్రం ఆదుకోకపోతే తీవ్రంగా నష్టపోతామని చెప్పారు. కెవిపి ప్రత్యేక హోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్ ఆర్ధిక అంశాలు ముడిపడివున్నాయంటూ తిరస్కరణకు గురికావడంపై విమర్శల వర్షం కురిపించారు విజయసాయి రెడ్డి. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఆయన.