ఇక్కడ వైసీపీ టిక్కెట్ ఖరారు చేసిన జగన్...!

Update: 2018-01-05 01:30 GMT

చంద్రబాబు మీద ఎవరు పోటీ చేసే విషయాన్ని వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు కుప్పం నియోజకవర్గ అభ్యర్థి ఆయనేనని జగన్ ప్రకటించారు. ఇటీవలే కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో జగన్ పార్టీ అభ్యర్థిగా శ్రీదేవిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జగన్ మరో అభ్యర్థిని ప్రకటించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ ను కలిసేందుకు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి అనేక మంది పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చారు. వారిని పెద్దూరు గ్రామంలో జగన్ కలుసుకున్నారు. వారితో జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు 1989 నుంచి అప్రతిహతంగా విజయం సాధిస్తూ వస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికి ఆరు ఎన్నికల్లో విజయం సాధించారు. భారీ మెజారిటీనే చంద్రబాబుకు కుప్పం ప్రజలు కట్టబెడుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లోనూ యాభైవేలకు పైగానే చంద్రబాబుకు మెజారిటీ వచ్చింది.

గెలిపిస్తే కేబినెట్లో చోటు గ్యారంటీ....

అయితే కుప్పం నియోజకవర్గంలో వైసీపీ సమన్వయ కర్తగా చంద్రమౌళి ఉన్నారు. ఆయనకు ఓటేయాలని జగన్ పిలుపునివ్వడం విశేషం. అంటే చంద్రమౌళికే ఈసారి కూడా టిక్కెట్ అని జగన్ చెప్పకనే చెప్పారు. గత ఎన్నికల్లోనూ చంద్రబాబు ప్రత్యర్థిగా వైసీపీ తరుపున చంద్రమౌళి బరిలోకి దిగారు. చంద్రమౌళికి ఓటు వేసి గెలిపిస్తే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని, కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలున్నారు. బీసీలంతా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటేయ్యాలని, వారికి బాబు ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న పాదయాత్ర కుప్పం నియోజకవర్గం నుంచి వెళ్లడం లేదు. దీంతో తాను పాదయాత్ర పూర్తయిన తర్వాత బస్సు యాత్ర ద్వారా కుప్పం వస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు.

ప్రస్తుతం పుంగనూరు లో....

ప్రస్తుతం జగన్ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నిన్న ఊటుపల్లి క్రాస్ రోడ్స్, మిట్టపల్లి, పెద్దూరు, చెరువు ముందరపల్లి, చెనకవారిపల్లి, కురవపల్లిలో జగన్ పాదయాత్ర చేశారు. రాత్రి కురవపల్లిలోనే జగన్ బస చేశారు. గురువారం జగన్ 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.జగన్ ఇప్పటి వరకూ728.4 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పుంగనూరు నియోజకవర్గం వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఇలాకా కావడంతో ప్రజలు పెద్దయెత్తున పాదయాత్రలో మమేకం అవుతున్నారు. ఈరోజు కురవవపల్లి నుంచి ప్రారంభమయ్యే జగన్ పాదయాత్ర గండ్లపల్లి, కంభంవారిపల్లి, కందూరు క్రాస్ రోడ్స్, సందా, భట్టువారిపల్లి, గొడ్కవారి పల్లి వరకూ పాదయాత్ర జరగనుంది.

Similar News