ఇక్కడ వీరి అసలు రూపం బయటపడుతుందా?

Update: 2018-02-24 02:30 GMT

బిజెపి, టిడిపి లు పైకి చెప్పే మాటలకు చేస్తున్న పనులకు పొంతనే లేదన్నది విశాఖలో నిర్వహిస్తున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు తేటతెల్లంగా ప్రజలముందు ప్రదర్శించబోతుంది. ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యంగా గత రెండేళ్ళుగా కేంద్ర రాష్ట్రాలు ఈ సదస్సును నిర్వహిస్తూ వస్తున్నాయి. మూడోసారి ఇప్పుడు చేపట్టాయి. అప్పుడు రెండు ప్రభుత్వాలు సంయుక్తంగానే ఈ సదస్సు చేపట్టాయి. ఇప్పుడు నిర్వహిస్తున్నాయి. తేడా ఒక్కటే ఆనాటి సంబంధాలకు నేడు రెండు పార్టీల నేతల నడుమ నడుస్తున్న యుద్ధమే. మేం అన్ని ఏపీకి సమకూర్చి పెడుతున్నామని ఒకరు, కేంద్రం మొండి చెయ్యి చూపిందని మరొకరు ఇలా ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు ఆరోపణలు సాగిస్తున్నారు.

ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటారా ..?

ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు భారత ఉపరాష్ట్రపతి తో పాటు పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరౌతున్నారు. వీరంతా ఒకే వేదికను పంచుకోవాలిసివుంది. ఏపీకి వున్న పెట్టుబడి అవకాశాలను గతంలోలా అంతర్జాతీయ వ్యాపారవేత్తలకు చెప్పాల్సివుంది. పనిలో పనిగా ఒకరి పనితీరును మరొకరు ప్రశంసించుకోక తప్పదు. ఇలాంటి పరిస్థితిలో బిజెపి, టిడిపిలు బయట చేస్తున్న యుద్ధం డ్రామానా? అన్న అనుమానాలు బలంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని, ప్యాకేజి గొడవ వదిలి హామీల అమలుకు నాలుగేళ్ళతరువాత తీవ్ర స్థాయిలో యుద్ధానికే దిగారు. మరో పక్క బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు హోదా పేరు ఎత్తితే జైలుకి పోతారంటూ ఒక విద్యార్థి సదస్సులో గతంలో సీఎం చేసిన వ్యాఖ్యలు చూపించి ఇప్పుడు ఎవరికి జైలుకి వెళ్లాలంటూ ఘాటు విమర్శలకు దిగారు. ఈ స్థాయిలో వివాదం నడుస్తున్న పరిస్థితి లో ఏపీలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ఈ రెండు పార్టీలు ఒకరిపై మరొకరు ఎలాంటి ప్రేమను, ద్వేషాన్ని వెళ్లగక్కుకుంటారా లేక ఎవరి ప్రభుత్వాల గొప్పలు వారు చెప్పుకుని సదస్సు ముగిసింది అనిపిస్తారో చూసేందుకు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Similar News