ప్రధాని నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రాల్లో ఎంత ఈజీగా గెలుపు సాధించారో...ఇక్కడ మాత్రం విజయం అంత తేలిక కాదు. ముఖ్యంగా రాజస్థాన్ బీజేపీకి తలనొప్పగా మారింది. ఈఏడాదిలోనే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వరుసగా జరగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుంది. రాజస్థాన్ లో ఇటీవల జరిగిన రెండు లోక్ సభ స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానంలో ఓటమి చెంది డీలా పడిన కమలనాధులకు మరో షాక్ తగిలింది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సయితం హస్తం పార్టీ విజయకేతనం ఎగురవేసింది.
ఉప ఎన్నికల్లో హస్తందే హవా....
దీంతో మరోసారి కమలం పార్టీలోఆందోళన ప్రారంభమైంది. ఇటవల రాజస్థాన్ లోని 21 జిల్లాల్లో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం ఆరు జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలిగింటిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీజీపీ ఒక్కచోట గెలవగా, మరొకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. అలాగే 21 పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికలు జరగ్గా ఇందులో 12 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ ఎనిమిది స్థానాలకే పరిమితమయింది. అలాగే ఆరు నగర పాలకసంస్థల ఎన్నికల్లో కూడా ఉపఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ నాలుగు, బీజేపీ రెండు స్థానాలు దక్కించుకున్నాయి.
వసుంధరపై ఫిర్యాదులు.....
ఈ ఫలితాలతో ఇటు గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో హస్తం పార్టీ హవా కొనసాగుతున్నట్లు అంచనా వేస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉండగా బీజేపీ క్యాడర్ డీలా పడిపోయింది. ఇటీవల జరిగిన రెండు లోక్ సభస్థానాలను, అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఉత్సాహంతోనే కాంగ్రెస్ విజయాలను రాజస్థాన్ లో ఇంకా కొనసాగిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ముఖ్యమంత్రి వసుంధర రాజే పై నానాటీకి సొంత పార్టీలోనే అసంతృప్తి పెరిగిపోతోంది. ఆమె నాయకత్వంలో పార్టీ ఎన్నికలకు వెళితే ఓడటం ఖాయమని ఆ పార్టీ నేతలు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. వరుస అపజయాలతో డీలా పడిపోయిన బీజేపీ క్యాడర్ లో ఉత్తేజం నింపేందుకు కేంద్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.