ఇక్కడ తొలిసారి వైసీపీ జెండా ఎగురుతుందా?

Update: 2018-02-22 01:30 GMT

టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గానికి జగన్ వెళ్లలేదు. అనంతపురంలో జగన్ పాదయాత్రలో హిందూపురంలేదు. వైసీపీ నేతలు కొందరు ఎందుకు బాలయ్య నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర చేయలేదని ప్రశ్నించారు కూడా. అయితే రూట్ మ్యాప్ లో లేకపోయినందునే ఆ నియోజకవర్గంలో జగన్ పర్యటించలేదని, పాదయాత్ర తర్వాత బస్సు యాత్రలో జగన్ హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని వైసీపీ సీనియర్ నేతలు చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్ర ముగిసి దాదాపు నెలన్నర తర్వాత ఈ ప్రశ్న ఎందుకొచ్చిందంటే ఇప్పుడు జగన్ బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు, చిరకాల మిత్రుడి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట....

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇది ఒకప్పుడు కమ్యునిస్టులకు కంచుకోట. 1955లో సీపీఎం నుంచి గుజ్జుల యల్లమందారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1962లో సీపీఐ అభ్యర్ధిగా గురుస్వామి రెడ్డి గెలిచారు. 1972లో కమ్యునిస్టు నేత సూరా పాపిరెడ్డి విజయం సాధించారు. అదేకమ్యునిస్టులకు చివరి విజయం అయింది. ఇక అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. 1978లో కాంగ్రెస్ అభ్యర్ధి భూతలపల్లి రామసుబ్బారెడ్డి విజయం సాధించారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడంతో ఆ పార్టీని కూడా కనిగిరి నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ముక్కు కాశిరెడ్డి 1985, 1994లో విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 1999, 2004 ఎన్నికల్లోకాంగ్రెస్ అభ్యర్థి ఇరిగినేని తిరుపతి నాయుడు గెలుపొందారు. 2009లో సయితం కాంగ్రెస్ అభ్యర్ధి ఉగ్రనరసింహారెడ్డి గెలుపొంది కాంగ్రెస్ కు హ్యాట్రిక్ విజయాలు దక్కాయి. దాదాపు పదిహేనేళ్ల తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడు కదిరి బాబూరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి మధుసూదన్ పై దాదాపు ఏడుఓట్ల తేడాతో కదిరిబాబూరావు విజయం సాధించడం విశేషం.

అభ్యర్థి ఎంపిక రాంగ్ అని....

అయితే నియోజకవర్గం ఏర్పడినాటి నుంచి చూసుకుంటే ఇక్కడ రెడ్డి,కమ్మ సామాజిక వర్గాలకు చెందిన వారే ఎక్కువగా విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన కదిరి బాబూరావు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాగా, వైసీపీ అభ్యర్ధి యాదవ కులానికి చెందినవారు. దీంతో సమీకరణలు మారిపోయాయి. కనిగిరి నియోజకవర్గంలో రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో ఇక్కడ వారికే ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయన్నది విశ్లేషకుల భావన. మధుసూదన్ ను మాజీ మంత్రి బాలినేని సిఫార్సుతోనే జగన్ టిక్కెట్ ఇచ్చారన్న ప్రచారమూ ఉంది. అభ్యర్థి ఎంపిక రాంగ్ అవడం వల్లనే గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ ఓటమి పాలయిందన్నది ఆ పార్టీ నేతలూ అంగీకరిస్తున్న విషయం. అయితే ఈసారి టిక్కెట్ ను జగన్ ఎవరికిస్తారన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో ఉంది. ప్రస్తుతం జగన్ కనిగిరి నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో అనేక మంది నేతలు ఆయన వద్దకు వచ్చి అభ్యర్ధిత్వాన్ని తమకే ఇవ్వాలని కోరుతున్నారు. మరి జగన్ ఈసారైనా సరైన అభ్యర్థికి టిక్కెట్ ఇస్తారా? కనిగిరి లో తొలిసారి వైసీపీ జెండా ఎగురుతుందా? చూడాలి.

Similar News