ఇక్కడ టీడీపీ వర్సెస్ టీడీపీ

Update: 2017-10-28 00:30 GMT

అనంతపురం జిల్లాలో తెలుగుతమ్ముళ్లు అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీయే అడ్డుపడుతుందని పదే పదే చెబుతున్న టీడీపీ నేతలు అనంతపురం జిల్లాను ఒకసారి చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలమధ్య ఆధిపత్య పోరు పెరిగి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఖరారైన టెండర్లను కూడా నిలుపుదల చేయిస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో తమ అనుచరులకు పనులు దక్కలేదని ఆ టెండర్లను రద్దు చేయించే పనిలో ఉన్నారు. ఇలా పెనుగొండ, కదిరి నియోజకవర్గాల్లో వివాదం మరింత ముదిరింది. ప్రజలు ఇబ్బందులు వీరికి పట్టడం లేదు. ఆధిపత్య పోరు, పనుల్లో వాటాను పొందేందుకే అడ్డదారిన పనులను అడ్డుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే తామిచ్చిన నిధులతోనే పనులు చేయాలంటూ అధికారులపై వత్తిడి తేవడం కూడా కన్పిస్తోంది.

అభివృద్ధి పనులకు ఆటంకం.....

పెనుకొండ నియోజకవర్గంలో ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పార్థసారథి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పెనుగొంద నుంచి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలని నిమ్మల కిష్టప్ప భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఎంపీ ల్యాడ్స్ నుంచిపెద్ద యెత్తున నిధులు తెచ్చి వాటిని తన అనుచరులకు కిష్టప్ప కట్టబెడుతున్నారు. వీటిని ఎమ్మెల్యే పార్థసారధి అడ్డుకుంటున్నారు. గోరంట్ల మండలంలోని పాల సముద్రంలో జాతీయ రహదారి నిర్మాణం కోసం నిమ్మల కిష్టప్ప 90 లక్షలు కేటాయిస్తే... పార్థసారధి 60 లక్షలు తీసుకొచ్చారు. దీంతో అధికారులకు ఎవరి నిధులతో రోడ్డు నిర్మించాలన్నది సమస్యగా మారింది. ఇక సీఎం రమేష్ ఎంపీ నిధుల నుంచి 20 లక్షలు తెప్పించుకున్నారు. పార్థసారధి. ఇలా అనేక పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. గోరంట్ల మండలంలో ఇటీవల ఒక రహదారి నిర్మాణం కోసం పంచాయతీ రాజ్ శాఖ 42 లక్షలు మంజూరు చేసింది. అయితే ఈ టెండర్లను నిమ్మల కిష్టప్ప అనుచరులు దక్కించుకున్నారు. అయితే పనులు జరగనివ్వకుండా పార్థసారధి మనుషులు అడ్డుకుంటున్నారు. పనులు ప్రారంభం కాకపోతే అధికారులు టెండర్లు రద్దు చేయక తప్పదు. కదిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచిన చాంద్ భాషా టీడీపీలో చేరిపోయారు. అయితే చాంద్ భాషాకు, అక్కడి తెలుగుదేశంపార్టీ నేత కందిగుంట వెంకట ప్రసాద్ కు మధ్య వార్ బహిరంగంగానే జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఏ టెండర్లు పిలిచినా ఇద్దరు నేతల అనుచరులు పోటీ పడి మరీ టెండర్లు వేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన చాంద్ భాషాను గ్రామాల్లోకి రాకుండా కూడా ప్రసాద్ వర్గం అడ్డుకుంటోంది. దీనిపై చాంద్ భాషా అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం మీద అనంత తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు అభివృద్ధికి ఆటకంగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Similar News