ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ కి కష్టాలు మొదలయ్యాయి. పలువురు ఎమ్మెల్యేల తీరుతో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కలిసి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌బాబు, ఆలేరు ఎమ్మెల్యే, విప్ గొంగడి సునీతకు పూర్తిగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి.
మున్సిపల్ ఛైర్మన్ భర్త హత్యతో....
ఇక తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ప్రకంపనలు రేపిన నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి మెడకు ఈ హత్య కేసు చుట్టుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి ఈ మొత్తం వ్యవహారం అధికార పార్టీ కి తీవ్ర నష్టం కలిగంచనుందని పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అసలే బలంగా ఉన్న ఈ జిల్లాలో ఈ కంచుకోటను బద్దలు కొట్టాలని కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుతో మాత్రం ఆయనకు తల బొప్పి కడుతోంది.
మర్చేస్తే...ఫలితం ఉంటుందా?
అయితే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం, మంత్రి జగదీశ్ రెడ్డిని తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లు పలువురు అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అదేవిధంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీతకు ఈసారి పరాభవం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. గాదరి కిశోర్‌ను తప్పించి అక్కడ టీడీపీ సీనియర్ మోత్కుపల్లి టీఆర్ఎస్‌లోకి వస్తే ఆయన్ను పోటీ చేయిస్తారని టాక్.ఇక సునీతపై సైతం వ్యతిరేకత ఉన్నా ఆమె విషయంలో చివరి వరకు సస్పెన్స్ తప్పదని అంటున్నారు. ఇక జిల్లాలో తాజా పరిణామాలన్నింటిని అనుకూలంగా మార్చుకొని రానున్న ఎన్నికల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎలాగైనా విజయం సాధించి నల్గొండ జిల్లాలో పూర్వవైభవం సాధించాలని ఆ పార్టీ నాయకులు ఉవ్విళ్ళూరుతున్నారు. ఇక్కడ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా గుత్తా, ఉమా మాధవరెడ్డి లాంటి సీనియర్లను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నా నాయకుల ఎఫెక్ట్‌తో టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బే పడనుంది.