ఇక్కడ ఎవరు ‘లోకల్’?

Update: 2017-12-23 18:29 GMT

ఎన్నికలు జరిగే సమయంలో లోకల్ నినాదం ఊపందుకోవడం ఎక్కడైనా సహజమే. సెంటిమెంట్ అద్దడం ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో అదే జరగుతుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇక్కడ లోకల్ నినాదం ఊపందుకుంటుంది. స్థానికులకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రంలో స్థానికులు ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక జెండా, కన్నడ భాషలోనే బోర్డులు ఉండాలన్న ఆందోళన కన్నడ రాష్ట్రంలో ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీనికి కాంగ్రెస్ సర్కార్ కూడా మద్దతు పలకడం విశేషం.

స్థానికులకే ఉద్యోగాలు...

ఈ నేపథ్యంలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్న డిమాండ్ తో కన్నడ రక్షణ వేదిక ఉద్యమాన్ని ప్రారంభించింది. బెంగళూరులో తమ సత్తాను ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. మొత్తం ఎనిమిది డిమాండ్లను వీరు ప్రభుత్వాల ముందు ఉంచుతున్నారు. ఎన్నికల సమయం కావడంతో తమ డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వాలు పరిశీలిస్తాయన్న నమ్మకంతో పోరుకు సిద్ధమవుతున్నారు.

20 ఏళ్లు ఇక్కడ ఉంటేనే...

కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కన్నడిగులకే స్థానంకల్పించాలన్నది ఒక డిమాండ్. కన్నడం చదివిన వాళ్లనే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక చేయాలన్నది మరో డిమాండ్. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు కన్నడం లోనే ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే కనీసం ఇరవై ఏళ్లపాటు కర్ణాటకలో ఉండాలి. అప్పుడే వారికి పౌరసత్వం ఇవ్వాలి. ఇలాంటి డిమాండ్లతో ఉద్యమానికి కన్నడ రక్షణ వేదిక సిద్ధమవుతోంది. ఇప్పటికే కర్ణాటకలో ఎన్నికల వేడి ప్రారంభమయింది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ లు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. దీంతో ఇదే అదనుగా భావించి కన్నడ రక్షణ వేదిక ఉద్యమాన్ని ప్రారంభించింది.

Similar News