ఇక్కడ అమిత్ షా కోసం ఓ ఇల్లు

Update: 2018-03-08 16:30 GMT

ఈశాన్య రాష్ట్రంలో విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న కమలనాధులు కర్ణాటకను కూడా కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అమిత్ షా కర్ణాటకలనే బస చేసి పరిస్థితులను సమీక్షించాలని నిర్ణయించుకున్నారు. అమిత్ షా బస చేయడానికి పెద్ద బంగళాను కర్ణాటక బీజేపీ పార్టీ అద్దెకు తీసుకుంది. ఇందులోనే అమిత్ షా బస చేయనున్నారు. అమిత్ షా ఈ వారం చివర్లో కర్ణాటకకు వచ్చి పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారు. ఇక్కడే కొద్దిరోజుల పాటు ఉండి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని తెలిసింది.

మిషన్ 150....

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల చివర లేకుంటే మే మొదటి వారంలో జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తులు ప్రారంభించింది. ఈ నెల 20వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది. మే నెల 28వ తేదీతో కర్ణాటక అసెంబ్లీ కాల పరిమితి ముగిసిపోతోంది. దీంతో ప్రధాని మోడీ కర్ణాటక ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనన్న లక్ష్యాన్ని అమిత్ షా ముందుంచారు. అందుకోసం ఆయన ఇప్పటికే నియమించిన బాధ్యులతో చర్చలు జరిపారు. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక విధాన సభలో 150 సీట్లను సాధించాలన్న లక్ష్యంతోకమలనాధులు ప్రచారం చేస్తున్నారు. దీనికి మిషన్ 150 గాకూడా నామకరణం చేశారు.

పరిశీలకులతో ప్రత్యేకంగా....

కర్ణాటక రాష్ట్రం మొత్తం మీద బీజేపీ 55 మంది పరిశీలకులను నియమించింది. ఇప్పటికే పార్టీ అభ్యర్థుల విషయంలోనూ అనేకసార్లు ఆ పార్టీ సర్వేలు కూడా చేయించింది. దీంతో అమిత్ షా కర్ణాటక వచ్చి ఈ సర్వే నివేదికలను పరిశీలించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పరిశీలకులతో కూడా ప్రత్యేకంగా సమావేశమై అభ్యర్థుల ఎంపికతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న అడ్వాంటేజీలు, కాంగ్రెస్ కు పట్టున్న స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై చర్చలు జరపనున్నారు.

సోషల్ మీడియా ప్రచారంలో ముందంజ....

ఇక బీజేపీ సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృతంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందుకోసం బీజేపీ 20 వేల వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసింది. ఈ గ్రూపుల ద్వారా బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందన్న విషయంతో పాటుగా సిద్ధరామయ్య సర్కార్ అవినీతిపై పెద్దయెత్తున ప్రచారం చేయాలని నిర్ణయించారు. వీరితో ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమై వారికి మార్గదర్శనం చేశారు. బూత్ స్థాయి కార్యకర్తలతోనూ అమిత్ షా త్వరలో సమావేశం కానున్నారు. కర్ణాటకను ఎలాగైనా దక్కించుకోవాలన్న కమలనాధులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు.

Similar News