వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సంతనూతల పాడు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. సంతనూతలపాడు నియోజకవర్గం రిజర్వ్ డ్ నియోజకవర్గం. 1962లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. పన్నెండు సార్లు జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. 1985లో టీడీపీ అభ్యర్ధి కసుకుర్తి ఆదెన్న, 1999లో టీడీపీ అభ్యర్ధి పాలపర్తి డేవిడ్ రాజులు ఇక్కడి నుంచి గెలిచారు. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ విజయం సాధించారు. అయితే కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే వైసీపీ అభ్యర్థి గెలవడం కొంత పార్టీని కలవరపర్చే అంశమే.
స్థానికేతరులకే ఎక్కువ...
ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఎక్కువగా స్థానికేతరులే పోటీ చేస్తూ వస్తున్నారు. అభ్యర్థి కన్నా ఇక్కడ పార్టీలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలుచుకుంది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ ఇక్కడ అడ్రస్ గల్లంతయింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమీకరణలే ఇక్కడ కూడా చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం జగన్ పార్టీకి మారిపోవడంతో గత ఎన్నికల్లో ఇక్కడ గెలుపు సాధ్యమయింది. అయితే ఈసారి గెలుపు అంత సులువు కాదంటున్నారు విశ్లేషకులు. స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి ఇందుకు కారణంగా చెబుతున్నారు.
యాత్రతో బలం పెరుగుతుందని....
జగన్ పాదయాత్ర తర్వాత సంతనూతలపాడు నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు దగ్గరగా ఉండే నియోజకవర్గం కావడంతో దీనికి ప్రాధాన్యత ఉంది. ఈసారి అభ్యర్థిని మార్చాలన్న యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అందుబాటులో ఉండకపోవడంతో ఆయనపై పెరిగిన వ్యతిరేకత కారణంగా ఈసీటును వదులుకోకూడదన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ చేయించిన సర్వేల్లో కూడా ఇదే విషయం స్పష్టం కావడంతో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ భావిస్తుంది. అయితే సురేష్ మాత్రం పార్టీని నమ్ముకునే ఉన్నారు. 22 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా సురేష్ మాత్రం జగన్ ను అంటిపెట్టుకునే ఉన్నారు. మరి సురేష్ విషయంలో తుదినిర్ణయం జగన్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
వందోరోజుకు చేరుకున్న.....
ఇక జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి వందో రోజుకు చేరుకుంది. పాదయాత్రను జగన్ గత ఏడాద నవంబరు 6న ప్రారంభించినప్పటికీ ప్రతి శుక్రవారం యాత్రకు విరామం ప్రకటించడం, క్రిస్మస్, సంక్రాంతికి కూడా యాత్ర చేయకపోవడం వల్ల నేటికి వందో రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం ఉప్పలపాడు క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమయ్యే జగన్ పాదయాత్ర వెల్లూరు క్రాస్ రోడ్స్, మర్రిచెట్ల పాలెం, బూదవాడ, రామతీర్థం మీదుగా చీమకుర్తి వరకూ పాదయాత్ర ను జగన్ కొనసాగిస్తారు. రాత్రికి జగన్ చీమకుర్తిలోనే బస చేస్తారు. మంగళవారం జగన్ మొత్తం 16.2 కిలోమీటర్ల మేరకు నడిచారు.