ఇక హాట్ హాట్ గా తెలంగాణ

Update: 2017-10-19 07:30 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి వాడివేడిగా జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీ నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక అంశాలు అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా డబుల్ బెడ్ రూంల ఇళ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల పంపిణీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, గొర్రెల పంపిణీ వంటి విషయాలపై ప్రభుత్వాన్నినిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. గత సమావేశాల మాదిరిగా కాకుండా ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానాలను రాబట్టాలన్నది విపక్షాల వ్యూహంగా ఉంది. అంతేకాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై కూడా వాయిదా తీర్మానాన్ని ఇచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి.

విపక్షం... అధికార పక్షం సిద్ధం.....

మరోవైపు అధికార పార్టీ కూడా వ్యూహాలను రచిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహకమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారు. ఈ నెల26వ తేదీన బిజినెస్ అడ్వజయిజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించి సమావేశాలను ఎప్పటి వరకూ కొనసాగించాలన్నది నిర్ణయిస్తారు. దాదాపు నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను జరపాలని ప్రభుత్వ ఉద్దేశ్యంగా కన్పిస్తోంది. నెల రోజుల్లో పదిహేను నుంచి 20 రోజులు పనిదినాలు ఉండేలా చూడాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అయితే హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలపై కూడా ప్రభుత్వం చర్చించనుంది. ఇక హైకోర్టు విభజనపై కూడా తెలంగాణ అసెంబ్లీలో చర్చిస్తారు. తెలంగాణలో ఎయిమ్స్ స్థాపన వంటి విషయాలు కూడా సభలో చర్చకు వచ్చే అవకాశముంది. వీటిపై మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఇటు అధికార పార్టీ, అటు విపక్షాలు సిద్ధమయ్యాయి.

Similar News