బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ఇక చెలరేగిపోవడం ఖాయమా ? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. టిడిపి అధినేత పైనా పార్టీ మీద సోము చేసిన విమర్శలు ఆరోపణలకు చెక్ పెట్టేందుకు సొంత మీడియా తో అమిత్ షా ఆయనకు వార్నింగ్ ఇచ్చారనే కధనాలు వండి వార్చారు. ఆ కధనాల తరువాత వ్యూహాత్మకంగా మౌనం దాల్చిన సోము మళ్ళీ టిడిపి తప్పులను లెక్కిస్తూ సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లతో చెలరేగిపోతున్నారు. అమరావతిలో మొదలు పెట్టిన వీర్రాజు ఉతుకుడు తాజాగా శ్రీకాకుళం జిల్లా లో నిర్వహించిన సభలో తారాస్థాయికి చేరింది.
చంద్రబాబే టార్గెట్ గా ...
ఇప్పుడు మిత్రపక్షం టిడిపిని విమర్శించడంలో సోము వీర్రాజు ఏ మాత్రం మొహమాటం పడటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబే లక్ష్యంగా ఆయన మాటల దాడి కొనసాగుతుంది. కేంద్రం లోటు బడ్జెట్ కోసం ఇచ్చిన నిధులు, అమరావతి నిర్మాణానికి ఇచ్చిన నిధులను టిడిపి పక్కదారి పట్టించి రాజకీయ ప్రయోజనాలకోసం మోడీ సర్కార్ ఏమి చేయలేదనే వాదన చేస్తుందని ఆరోపించారు వీర్రాజు. నిధులు దారి మళ్ళించడం ఒకటైతే మరోపక్క సామాజిక మరుగుదొడ్లలో చనిపోయిన వారిపేరుతో నిధులు డ్రా చేసుకుని సీఎం జిల్లాలో తినేశారన్నారు ఆయన. గతంలో విభజించబడ్డ రాష్ట్రాల్లో కేవలం నాలుగు వందలకోట్ల రూపాయలతో రాజధానులు నిర్మిస్తే, పక్క రాష్ట్రంలో కేసీఆర్ 150 కోట్లరూపాయలతో సచివాలయం కడుతుంటే 1500 కోట్లరూపాయలు ఇచ్చినా చాలవని వేలకోట్ల రూపాయలు కేంద్రాన్ని కోరుతున్నారని విఠలాచార్య తో కూడా సెట్టింగ్స్ వీలయితే వేయించేలా వున్నారని వ్యగ్యంగా తూటాలు పేల్చారు. ఉపాధి హామీ పధకం, చెట్టు నీరు, ఇసుక, ఇలా ప్రతి దాంట్లో అవినీతి కి పాల్పడి ప్రజలకు అందాలిసిన అభివృద్ధి ఫలాలు దక్కకుండా టిడిపి చేస్తుందని విమర్శించారు సోము. ఇక అధికార వికేంద్రీకరణ జరగాలి ప్రతి జిల్లా అమరావతి కావాలని బిజెపి తలిస్తే హైదరాబాద్ లా అధికార కేంద్రీకరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పవన్ ను విడిచిపెట్టని సోము ....
ఇచ్చిన నిధులపై లెక్కలు చెప్పాలని నిలదీస్తున్న పవన్ కళ్యాణ్ ను నిజనిర్ధారణ కమిటీపై విమర్శలు గుప్పించారు వీర్రాజు. కుప్పలు తెప్పలుగా ఎన్నికల హామీలు ఇచ్చిన తెలుగుదేశాన్ని పవన్ ఎందుకు నిలదీయరన్నారు. జయప్రకాశ్ నారాయణ ఏపీకి ఇచ్చిన నిధులపై లెక్కలు రాష్ట్రం చెప్పాలిసిన అవసరం లేదనడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు సోము. ఇంట్లో భార్యకు డబ్బు ఇచ్చిన భర్త లెక్కలు అడగడా అంటూ ప్రశ్నించారు వీర్రాజు. నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు గా వున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ బిజెపి,టిడిపి లు రెండు తప్పులు చేశాయని ఎలా చెబుతారన్నారు. 60 శాతం చట్టంలో వున్నవి కేంద్రం చేసిందని చెబుతున్న ఉండవల్లి కి 2022 వరకు హామీల అమలుకు గడువు ఉందన్న విషయం తెలియదా అంటూ విరుచుకుపడ్డారు. సోము వీర్రాజు తాజా గా చేసిన వ్యాఖ్యలు ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. కేంద్రం, రాష్ట్రం నడుమ సాగుతున్న మాటల యుద్ధంలో జనసేనను సైతం బిజెపి విస్మరించకపోవడం విశేషం.