పెరిగిన ధరల ప్రకారం చెల్లింపులు చేసేది లేదన్న క్లారిటిని పోలవరం ప్రాజెక్ట్ పై త్రిసభ్య కమిటీ ఇచ్చేసింది. దీనిపై ఏపీ సర్కార్ వాదనలు తోసిపుచ్చింది. గత రెండు రోజులుగా పోలవరం ప్రాజెక్ట్ పై వున్న ప్రధాన సమస్యలను అధ్యయనం చేస్తూ వచ్చిన త్రిసభ్య కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో సమావేశం అయ్యాక ఈ విషయాన్నీ తేల్చి చెప్పడం గమనార్హం. పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ఆందోళన పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో పెరిగిన ధరలు చెల్లించి ప్రాజెక్ట్ ను వేగవంతంగా పూర్తి చేయాలని బాబు సర్కార్ కేంద్రంతో చర్చలు జరుపుతుంది.
కుదేలైపోనున్న రాష్ట్రం ...
జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడంతో మొత్తం ఖర్చు కేంద్రం చెల్లించాలని విభజన చట్టం చెబుతుంది. పోలవరం అంచనా వ్యయం పెరిగిన దానికి రాష్ట్రం ఆ బాధ్యత మోస్తే ఏపీ ఖజానా మరింత దివాళా తీస్తుంది. ఇప్పటికే లక్షా ఇరవై వేలకోట్ల రూపాయలు సుమారుగా అప్పు భారాన్ని మోస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా పోలవరం లో పెరిగిన ఖర్చు భరించాలిసి వస్తే తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్ లో ప్రతి రూపాయి పెరిగిన ఖర్చు కూడా కేంద్రమే చెల్లిస్తుందని స్పష్టం గా పేర్కొన్నారని గుర్తు చేస్తున్నారు నిపుణులు. అయినా కేంద్రం ససేమిరా దీనికి అంగీకరించకపోవడం, రాష్ట్రం ఇంత అన్యాయం చేస్తున్నా గట్టిగా స్వరం పెంచకపోవడాన్ని అంతా తప్పు పడుతున్నారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఏపీ ప్రజలకు అప్పుగా చుట్టుకుంటుందన్న ఆందోళన పెరుగుతుంది.
మరోసారి గడ్కరీ ముందుకు బాబు ....
ఢిల్లీలో ఉన్నతస్థాయి అధికారులు మంత్రులతో జరిగే సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. పెరిగిన ధరల ప్రకారం పోలవరం వ్యయాన్ని మంజూరు చేయాలని బాబు గడ్కరీని కోరనున్నారు. కొత్త టెండర్లు రద్దు చేసిన నేపథ్యంలో మధ్యే మార్గంగా కన్సార్టియం ద్వారా పనుల వేగం పెంచవచ్చని బాబు చేయనున్న ప్రతిపాదన కేంద్రం ఏ మేరకు అంగీకరిస్తుందో చూడాలి.