ఇక ఫోకస్ తెలంగాణాయేనా?

Update: 2017-12-20 00:30 GMT

కమలనాధులు జోరు మీదున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్ లో పక్కా ప్రణాళికతో వెళ్లినందునే ఓటమి అంచునుంచి బయటపడ్డామన్నది వారికీ తెలియంది కాదు. అలాగే ఇప్పుడు మరో పెద్ద రాష్ట్రమైన తెలంగాణపై అమిత్ షా దృష్టిపెట్టనున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. త్వరలోనే తెలంగాణలో అమిత్ షా పర్యటన ఉంటుందని చెబుతున్నారు. దక్షిణాదిన తొలిగడప అయిన తెలంగాణలో ముఖ్యంగా పార్లమెంటు స్థానాలపైనే ఎక్కువగా గురిపెట్టనున్నారు.

అచ్చ తెలుగులో...

ఇటీవల మెట్రో రైలు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కూడా ప్రధాని మోడీ దాదాపు రెండు నిమిషాలు తెలుగులో మాట్లాడటం తెలిసిందే. ఆయన తెలుగును హిందీలో రాసుకుని మరీ చదివారు. గతంలో ఎన్నడూ మోడీ ఇలా చేయలేదు. కేవలం నమస్కారం, సోదర, సోదరీమణులారా అనే పదాలనే తెలుగులో ఉచ్ఛరించేవారు. కాని మెట్రో రైలు ప్రారంభించడానికి వచ్చిన మోడీ బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని తెలుగులోనే ప్రసంగించడమే కాకుండా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరించుకున్నారు. పటేల్ వల్లనే తెలంగాణ సంస్థానం విలీనమైందన్న విషయాన్ని తెలంగాణలో బలంగా ప్రచారం చేయనున్నారు.

ఉత్తరప్రదేశ్ లో లాగానే...

ఇక తెలంగాణలో గుజరాత్ ఫార్ములా కాకుండా యూపీ ఫార్ములాను అనుసరించాలన్నది కమలద్వయం వ్యూహంగా కన్పిస్తోంది. ఆరు నెలల క్రితం తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించిన అమిత్ షా మిషన్ తెలంగాణను ప్రాంరంభించారు. బూత్ లెవల్లో పార్టీని పటిష్టం చేసేందుకు త్వరలోనే రాష్ట్ర, జిల్లా, మండల, బూత్ స్థాయి నేతలతో షా సమావేశం కానున్నట్లు తెలిసింది. తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లోనూ కాషాయ జెండా ఎగురవేసేందుకు పథక రచన చేస్తున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇప్పటికే రాష్ట్ర నేతలకు సూచించారు. త్వరలోనే తెలంగాణలో అమిత్ షా పర్యటన ఉంటుందని, ఇక ఫోకస్ అంతా తెలంగాణయేనని కమలనాధులు చెబుతున్నారు.

Similar News