ఇక నీటి యుద్ధాలకు తెరపడనుందా ...?

Update: 2018-02-21 04:30 GMT

ప్రతి నీటి బొట్టు విలువైనదే. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలన్నిటికి నీటి కోసమే అన్నది నిపుణుల మాట. మన దేశంలో కూడా నీటియుద్ధాలు రాష్ట్రాలనడుమ తీవ్రస్థాయిలోనే జరుగుతూనే వున్నాయి. వీటిని పరిష్కరించడానికి కేంద్ర జలసంఘం కానీ, ట్రిబ్యునల్స్ కానీ, కోర్టులు సైతం కేసులు విచారిస్తూనే వున్నా ఏ రాష్ట్రం అవి ఇచ్చే తీర్పులపై సంతృప్తి చెందడం లేదు. ఎప్పుడు కావేరి జలాలకోసం కర్ణాటక, తమిళనాడు నడుమ రావణకాష్టం నడుస్తూనే ఉంటుంది. ఇక కృష్ణా జలాలకోసం కర్ణాటక, తెలంగాణ, ఏపీ నడుమ, ఏపీ తెలంగాణ నడుమ, గోదావరి జలాలకోసం మహారాష్ట్ర, చత్తిస్ ఘడ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ నడుమ నీటి యుద్ధాలు సాగుతూనే వున్నాయి. ఇక మనదేశ సరిహద్దుల్లో ప్రవహించే నదుల నీటి వాటా కోసం చైనా, పాకిస్థాన్, బాంగ్లాదేశ్ నడుమ వివాదాలు వున్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి మేధో మధనం చేసింది దక్షిణాది జలమండలి సమావేశం.

ఒకే జాతీయ జలవిధానం కోసం ...

జాతీయ స్థాయిలో ఒకే జలవిధానం ఉండాలి. ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు కావాలి అనే అంశంపై ఏకాభిప్రాయం వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల జలమండలి సదస్సులో దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందించబడ్డాయి. ఈ పార్లమెంట్ సెషన్ లోనే ఒక బిల్లు తెచ్చి చట్టం తీసుకువచ్చి అంతరాష్ట్ర జలవివాదాలకు చెక్ పెట్టాలని నిర్ణయం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి పాల్గొన్న భారీనీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు పాల్గొన్నప్పటికీ ఏపీనుంచి కార్యదర్శి స్థాయి అధికారిమాత్రమే పాల్గొన్నారు. కేంద్ర జలవనరుల శాఖామంత్రి పాల్గొన్నారు.సదస్సులో తెలంగాణ ఏపీ నడుమ కృష్ణా నీటి వాడకంపై వార్ నడిచినట్లు తెలియవచ్చింది. 200 ల టిఎంసిల ను తెలంగాణ అదనంగా వాడుకున్నట్లు ఎపి ఆరోపించడం సదస్సును వేడెక్కించింది.

Similar News