ఇక తెలంగాణలో నేరం చేశారో.....!

Update: 2018-01-18 02:17 GMT

నేరం ఎక్కడ జరిగినా క్షణాల్లో గుర్తిస్తారు.. నిందితులు ఎంత తెలివిగా వ్యహరించినా చిటికెలో పట్టేస్తారు.. ఎక్కడ ఎప్పుడు తేడా వచ్చినా చర్మం వలిచేస్తారు. తప్పు చేయాలని ఆలోచించినా సెకండ్ లో గుర్తిస్తారు. నిత్యం నిఘా కళ్ళే కాదు.. మా ఆలోచనలు కూడా వెంటాడుతాయంటున్నారు తెలంగాణ పోలీసులు... నేరం ఎలా జరిగింది... చేసింది ఎవరో ఇట్టే పట్టేసేలా రూపొందించిన సమగ్ర సర్వే పై ఓ రిపోర్ట్..

సమగ్ర నేరస్థుల సర్వే....

సమగ్ర నేరస్థుల సర్వే... ఇదేదో ఓటర్ల లిస్టులో లేకా ఆధార్ కార్డ్ వివరాల సేకరణ అనుకుంటే పొరపాటు. ఇది నేరస్థుల వివరాలు సేకరించి.. వారి ఆటకట్టించేందుకు రూపొందుతున్న ఓ బృహత్తర కార్యక్రమం. నేరస్థుడు ఎవరైనా.. ఎక్కడ తప్పు చేసినా క్షణాల్లో గుర్తు పట్టేలానే కాదు.. చిటికెలో తెలుసుకునేలా రూపొందించిన కార్యక్రమం ఇది. ఎక్కడ నేరం జరిగినా. తప్పు చేసినా వాడు ఎంత తెలివిగా ప్రవర్తించినా తమకు తెలిసిపోతుందంటున్నారు తెలంగాణ పోలీసులు.

ప్రత్యేకంగా యాప్....

అందుకోసం ఇటీవల తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఓ యాప్ ని రూపొందించారు. అందులో స్టేషన్ ల వారీగా తమ ప్రాంతాల్లో ఉన్న నేరగాళ్లను ఆయా స్టేషన్ ల ఆధికారులు పొందుపరిచారు. తమ ఏరియాలో ఎంతమంది నేరస్తులు వున్నారు. వారి వివరాలు కూడా జత చేశారు. ఇక ఆ యాప్ ద్వారా కానిస్టేబుల్ స్థాయి నుండి డీజీపీ స్థాయి అధికారుల వరకు ప్రతి నేరస్థుడి వివరాలు సులువుగా తెలుసుకునే వీలుంటుంది. అంతే కాదు ఏదైనా నేరం జరిగితే క్షణాల్లో సంబంధిత పోలీస్ స్టేషన్ కి నిందితుడి ఫొటోతో సహా వివరాలు అందేలా రూపొందించారు. పెట్రోలింగ్ లో ఉన్న బీట్ సిబ్బంది ట్యాబ్ లో తెలుసుకోవడం కాదు. కానిస్టేబుల్ వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు చిటికెలో వివరాలు తెలిసిపోతాయి.

జియో ట్యాగింగ్ ద్వారా....

ఈ యాప్ ద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని పోలీస్ బాస్ లు ఓ అంచనాకు వచ్చారు. గతంలో హైదరాబాద్ కమిషనర్ గా మహేందర్ రెడ్డి ఉన్న సమయంలో ఇలాంటి నేరస్థుల సర్వే రూపొందించారు. అది ఎంతగానో ఫలితాలు ఇచ్చాయి. అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే చాలా సందర్భాల్లో నేరస్థుల పై నిఘా పెంచి వారి వివరాల కోసం వెళ్లిన పోలీసులకు చేదు అనుభవాలు ఎదురైనాయి. జైలు నుండి బయటకు రాగానే ఆ నేరస్థుడు మకాం మార్చడంతో అతనిపై ఉన్న వారెంటులు పెండింగులో పడిపోవడమే కాదు... వారి వివరాలు తెలుసుకోవడమే కష్టంగా మారింది. అందుకే కొత్తగా రూపొందించిన ఈ యాప్ లో నేరస్థుల వివరాలతో పాటు వారికి జియో ట్యాగింగ్ ని పొందుపరిచారు. జైల్ నుండి బయటకు వచ్చినా, తప్పించుకొని తిరిగినా క్షణాల్లో జియో ట్యాగింగ్ ద్వారా అతను ఎక్కడ ఉన్నాడో ఇట్టే తెలిసిపోతుంది.

సర్వే ప్రకారం వివరాలను....

ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ సర్వే లో నేరస్తులు వారి వివరాలు లేటెస్ట్ ఫోటో వారి నడవడిక తెలుసుకుంటారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లో ఏ నేరం చేయాలని చూసిన వెంటనే తెలిసిపోతుంది. ఇటీవల కాలంలో మన వాళ్లకన్నా పక్క రాష్ట్రానికి చెందిన నేరగాళ్లు శివార్లలో తిష్ట వేసి మరి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందుకే కేవలం మన రాష్ట్రంలో ఉన్న నేరగాళ్లే కాకుండా పక్కన రాష్ట్రానికి చెందిన వారు వివరాలుకుడా ఉంటాయి. ఇప్పటికే కమ్యూనిటీ సీసీ టీవీ, పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ తో దూసుకు పోతున్న తెలంగాణ పోలీసులు చేపట్టిన సమగ్ర నేర సర్వే కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.

Similar News