తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక జనంలోకి దూకనున్నారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు అధికంగా ఉండటంతో ఇప్పటినుంచే పార్టీ శ్రేణులను కదన రంగంలోకి పంపేందుకు వాళ్ళు వీళ్ళు కాకుండా తానే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో భారీ విజయం వేడి చల్లారకుండా ఉండాలి అంటే నల్గొండ పార్లమెంట్ ఉప ఎన్నికలు జరిపి విపక్షాలను రాబోయే ఎన్నికలకు ముందే నిరాశ నిస్పృహలతో ఉండేలా చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు టిఆర్ ఎస్ వర్గాల సమాచారం. దీనికోసం పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారట కేసీఆర్ . ఇక పై వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి కేసీఆర్ నేరుగా ప్రజల ముందుకు వెళ్లేలా ఆయన షెడ్యూల్ రూపొందిస్తున్నారు.
ఈనెల 9 నుంచే కార్యాచరణ ...
గులాబీ బాస్ ఈనెల 9 నుంచి తన పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో పలు కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. తరువాత సిద్ధిపేట ,సిరిసిల్లా , సూర్యాపేట, వరంగల్ నగరాల్లో పర్యటించనున్నారు. ఇటీవల విపక్షాలన్నీ ఏకమై అధికార టిఆర్ ఎస్ పై చేస్తున్న విమర్శలను ప్రజలముందు తిప్పికొట్టాలని భావిస్తున్నారు. సింగరేణి విజయం తెచ్చిన ఊపు కొనసాగించాలంటే తానే జనం ముందుకు పోవాలన్నది కేసీఆర్ స్కెచ్ . దీనివల్ల పార్టీ శ్రేణులకు నూతన ఉత్సహం రావడంతో పాటు క్రింది స్థాయిలో వున్న సమస్యలు తెలుసుకుని ఎన్నికల్లోపు ప్యాచ్ వర్కులు పూర్తి చేయాలన్నది ఆయన ఆలోచన. ముఖ్యంగా భారీ బహిరంగ సభల ద్వారా సత్తా చాటుతూ విపక్షాలను ఊపిరి సలపనీయకుండా ఎదురుదాడి కి వ్యూహం రచిస్తున్నారు టి సీఎం. దాంతో తెలంగాణాలో కారు గేరు మార్చుకుని స్పీడ్ అందుకోనుంది మరి .