ఇక జగన్ కు మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలేనా?

Update: 2017-11-05 02:30 GMT

రాష్ట్రంలోనే అతిపెద్దదైన తూర్పు గోదావరి జిల్లాలో ఫ్యాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు గోదావరి జిల్లాపైనే చంద్రబాబు ఎక్కువగా దృష్టిపెట్టినట్లు కన్పిస్తోంది. దీంతో ఈ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పొరుగునే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పసుపు మయమే. అక్కడ గత ఎన్నికల్లో టీడీపీ స్వీప్ చేసేసింది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. టీడీపీలో చేరిన వెంటనే జ్యోతుల నెహ్రూ తన కుమారుడు నవీన్ కు జడ్పీ ఛైర్మన్ పదవి ఇప్పించుకోగలిగారు. తాజాగా ఇదే జిల్లాకు చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక జిల్లాలో మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరే ఇద్దరు. ఒకరు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కాగా, మరొకరు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. జ్యోతుల నెహ్రూతో పాటు జగ్గిరెడ్డి వెళతారన్న ప్రచారం జరిగింది. కాని ఆయన మాత్రం ప్రస్తుతానికి పార్టీలోనే ఉన్నారు.

మిగిలిన ఇద్దరూ పార్టీ మారతారా?

అయితే వంతల రాజేశ్వరి పేరు కూడా జ్యోతుల నెహ్రూ పార్టీని వీడే సమయంలోనే విన్పించింది. అయితే ఆమె అప్పుడు పార్టీని వీడలేదు. అయితే తాజాగా వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయబాబుతో ఉన్న వైరమే ఆమెను పార్టీని వీడేలా చేసిందంటున్నారు. తనను ఉదయబాబు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వైసీపీ అధినేత జగన్ కు చెప్పినా పట్టించుకోలేదట. మరోవైపు ఆమెకు అండగా ఉన్న వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఆమెను ఇటీవల కాలంలో పట్టించుకోలేదు. దీంతో ఆమె ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడటం వల్లనే టీడీపీలో చేరినట్లు వంతల రాజేశ్వరి అనుచరులు చెబుతున్నారు. వంతల రాజేశ్వరి పార్టీలోకి వచ్చినా తెలుగుదేశానికి వచ్చే ప్రయోజనమేమీ లేదని ఆ పార్టీనేతలకూ తెలుసు. కాని జగన్ పాదయాత్ర సమయలో పార్టీలోకి తీసుకుంటే కొంత అడ్వాంటేజీ ఉంటుందనిభావించి టీడీపీ స్వాగతించిందంటున్నారు. ఇక మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పార్టీని వదిలే అవకాశం లేదు. ఎందుకంటే అవతల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి సొంత నియోజకవర్గం. ఇక మరో ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి కూడా టీడీపీలో ఛాన్స్ లేదు. ఎందుకంటే టీడీపీలో చేరినా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదు కనుక. అయితే ఏదైనా బ్రహ్మాండం జరిగితే తప్ప వీరిద్దరూ పార్టీని వీడబోరు. సో... అతి పెద్ద జిల్లాలో ఫ్యాన్ పార్టీకి మిగిలింది ఇక ఇద్దరే ఎమ్మెల్యేలు.

Similar News