చీరకట్టు అందమే వేరు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ చీరకట్టుకు వున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ప్రపంచస్థాయి క్రీడా వేదికలపై కట్టుబొట్టుతో చీరకట్టుతో వయ్యారంగా భారత జాతీయ పతాకాన్ని చేతపట్టి ఆయా క్రీడా సంబరాల ప్రారంభాన సాగే మార్చిఫాస్ట్ లో నడిచే మహిళా ఆధ్లెట్లు అందరిలో హైలెట్ గా నిలిచేవారు. ఇప్పడు క్రీడా ప్రారంభాల సమయంలో ఆ చీరకట్టు ఇకపై కనపడదు. కొత్త డ్రెస్ కోడ్ ను భారత ఒలింపిక్ సంఘం జారీ చేసింది. నూతన డ్రెస్ కోడ్ ప్రకారం మన మహిళా క్రీడాకారిణులు నేవీ బ్లూ కలర్ షర్ట్ కోటు ప్యాంట్ ధరించి మార్చ్ ఫాస్ట్ లో పాల్గొంటారు. పురుష క్రీడాకారులకు ఇదే డ్రెస్ కోడ్ ఉంటుంది.
చీరను ఎందుకు వద్దన్నారంటే ...?
దేశంలోని మహిళా క్రీడాకారులు చీరకట్టుకోవడం వచ్చినా రాకపోయినా ప్రపంచ క్రీడా వేదికలపై జరిగే మార్చ్ ఫాస్ట్ లో చచ్చీచెడీ అయినా చీరకట్టుకోవడం ముందుగా నేర్చుకుని వాటిలో పాల్గొనాల్సివచ్చేది. ఇది తమకు మార్చిఫాస్ట్ లో పలు సమస్యలు తెచ్చిపెడుతున్నట్లు మహిళలు ఎప్పటినుంచో ఫిర్యాదు చేస్తున్నారు. దాంతో దీనిపై విచారణ సంఘాన్ని నియమించింది ఒలింపిక్ కమిటీ. ఆ కమిటీ వారి సమస్యలు సహేతుకమైనవేనని తేల్చడంతో చీరకట్టు స్థానంలో ప్యాంటు ,షర్ట్ ,కోటు వచ్చేశాయి. త్వరలో ఆస్ట్రేలియాలో జరగనున్న కామన్వెల్త్ క్రీడా పోటీలనుంచి కొత్త డ్రెస్ కోడ్ విధానం అమలు కాబోతుంది. ఈ కొత్త డ్రెస్ లో మనవారు అనేక దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తున్న చీరకు ఇక బై బై చెప్పనుండటం విశేషం.