తమిళులు అమ్మగా ప్రేమించే జయలలిత చనిపోయి ఏడాది దాటి పోయింది. అయితే ఇంకా జయ ఎవరి మనిషన్నది తేలలేదు. మూడు గ్రూపులుగా విడిపోయి అన్నాడీఎంకే వర్గాలు కొట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పళనిస్వామి, దినకరన్ వర్గాలు జయను ఓన్ చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. రానున్నది స్తానిక సంస్థలు ఎన్నికలు కావడంతో రెండు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు తమ వైపు తిప్పుకునేందుకు మరోసారి అమ్మ జపాన్ని మొదలు పెట్టేశారు. జయకు అసలైన రాజకీయ వారసులం తామేనని చెప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు.
దినకరన్ పర్యటనలో కూడా....
దినకరన్ ఈ నెల 2వ తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనకు ప్రజలు పెద్దయెత్తున తరలి వస్తున్నారు. దినకరన్ చేత తమ బిడ్డలకు నామకరణాలు చేయిస్తున్నారు. రక్త తిలకాలు దిద్దుతున్నారు. దినకరన్ పర్యటన అంతా అమ్మ జపంతో నే నడుస్తుంది. జయలలితను కంటికి రెప్పలా చూసుకునే చిన్నమ్మ శశికళను అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం జైలులో పెట్టిందని, ఆ ప్రభుత్వానికి పళని, పన్నీర్ సెల్వంలు కాపు కాస్తున్నారని చెబుతున్నారు. శశికళ తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి మరీ జయలలితకు సపర్యలు చేయడంతోనే ముప్ఫయి ఏళ్లు గడిపిందన్న విషయాన్ని దినకరన్ గుర్తు చేస్తున్నారు. అలాంటి శశికళను పదవి కోసం కేంద్రంతో కుమ్మక్కై జైలులో పెట్టించారని ప్రజలకు నూరిపోస్తున్నారు. ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికలకోసమేనన్నది అందరికీ తెలిసిందే. జయలలితకు అసలైన వారసులం తామేనని, ఆమె ఆశయాలను అమల్లోకి తీసుకువస్తామని ఆశీర్వదించమని దినకరన్ ప్రజలను కోరుతున్నారు.
అమ్మ కోసం....అన్నాడీఎంకే...
అయితే దినకరన్ పర్యటనకు మంచి స్పందన లభిస్తుందని ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న పళని ప్రభుత్వం అందుకు విరుగుడు చర్యలు ప్రారంభించింది. జయలలిత ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పటికే ప్రారంభించింది. మరికొన్ని ఫైళ్లను దులిపేందుకు రెడీ అయింది. ఇక జయలలిత నిలువెత్తు విగ్రహం ఏర్పాటుకు అధికార అన్నాడీఎంకే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జయలలిత నివసించిన పోయెస్ గార్డెన్ నున స్మారక మందిరంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. అలాగే జయలలిత సమాధిని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తాజాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో అమ్మ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. ఇప్పటికే పార్టీ కార్యాలయంలో ఎంజీఆర్ విగ్రహం ఉంది. ఆ విగ్రహం పక్కనే జయలలిత విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పనులను ప్రారంభించారు. ఈ నెల 24వ తేదీన జయలలిత జయంతిరోజున విగ్రహావిష్కరణ చేయాలనిపళనిస్వామి, పన్నీర్ సెల్వంలు నిర్ణయించారు. ఇలా అందరూ అమ్మ బాట పట్టారు. అమ్మ వారసులం తామేనని చెప్పుకోవడానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. మరి స్థానికసంస్థల్లో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి.