టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీని వీడిపోవడం దాదాపు ఖాయమైపోవడంతో నిజామాబాద్ జిల్లా టీడీపీ నేతలు కూడా క్యూకట్టే పరిస్థితి ఉందంటున్నారు. అయితే వీరిలో కొందరు టీఆర్ఎస్ లో చేరుతుండగా,.. మరికొందరు రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి వెళుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఉమ్మడి రాష్ట్రంలోఒకప్పుడు ఈ జిల్లాలో పసుపు పార్టీ క్లీన్ స్వీప్ చేసింది కూడా. అలాంటి జిల్లా రాష్ట్ర విభజనతో టీడీపీ ఇబ్బందుల్లో పడింది. సీనియర్ నేతలు, క్యాడర్ ఉన్నా ఓట్లు మాత్రం లేకుండా పోయాయి. నిజామాబాద్ జిల్లాలో టీడీపీకి అరికెల నర్సారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ వంటి నేతలు పుష్కలంగా ఉన్నారు. అయితే మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. పెద్దగా పార్టీని పట్టించుకోవడం లేదు. మండవ వెంకటేశ్వరరావును నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి మండవ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక అన్నపూర్ణమ్మ కూడా టీఆర్ఎస్ నుంచి తన తనయుడిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు.
రేవంత్ వెంట వెళ్లే వారిలో....
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి కారెక్కిన నేతలు ఉన్నారు. వారు ఉన్నతపదవులను చేపట్టారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పోచారం శ్రీనివాసులురెడ్డి టీడీపీ నుంచి వచ్చి మంత్రి అయ్యారు. అలాగే ప్రస్తుతం విప్ గా ఉన్న గంపా గోవర్థన్ కూడా టీడీపీ నుంచి వచ్చిన వారు. అయితే ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాకు అరికెల నర్సారెడ్డి పెద్దదిక్కుగా ఉన్నారు. అరికెట నర్సారెడ్డి పయనం ఎటన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆయన రేవంత్ వెంట వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. రాహుల్ కు రేవంత్ ఇచ్చిన జాబితాలో అరికెల నర్సారెడ్డి, బాల్కొండ ఇన్ ఛార్జి రాజారాం యాదవ్, ఎల్లారెడ్డి ఇన్ ఛార్జి వడ్డేపల్లి శుభాకర్ రెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా రేవంత్ వెంట వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తమ అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం చెప్పారట. అయితే టిక్కెట్ల విషయంలోనే కొంత కన్ఫ్యూజన్ ఉంది. రేవంత్ రెడ్డి వెంట వెళితే ఫ్యూచర్ ఉంటుందా? ఉండదా? అన్న ఆలోచన ను కూడా వీరిని కొంత వెనక్కు లాగుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ లో ఉండటం వృధా అని మాత్రం డిసైడ్ అయిపోయారు. వీరు కనుక పార్టీ వీడితే నిజామాబాద్ జిల్లలో పసుపు పార్టీ ఖాళీ అవ్వడం ఖాయం.