దేశంలో అందరి ముఖ్యమంత్రుల కన్నా చంద్రబాబు టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఆయన దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ముఖ్యమంత్రుల ఆస్తులపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ఎన్నికల అఫడవిట్ ఆధారంగా దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల ఆస్తులను పరిశీలించి వెల్లడించింది. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రుల కన్నా అత్యధికంగా స్థిర, చరాస్తులను ఉన్నట్లు తేల్చారు.
ఆస్తుల్లో ఆయనే టాప్.....
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తుల విలువ 177 కోట్లు. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులను కలపడంతో అత్యంత ఎక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు తొలిస్థానం పొందారు. రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 129 కోట్లు. ఆ తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిలిచారు. అమరీందర్ ఆస్తుల విలువ 48 కోట్లు. అయితే వీరు ఎప్పటికప్పడు ఆదాయపన్ను లెక్కలు సమర్పిస్తున్నారు.
నాలుగో స్థానంలో కేసీఆర్...
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తుల విషయంలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన ఎన్నికల అఫడవిట్ లో చూపించిన లెక్కల ప్రకారం ఆస్తుల విలువ 15.51 కోట్లు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆస్తుల విలువ కేవలం 30 లక్షలు మాత్రమే. ఇక జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆస్తులు 55 లక్షలుగా చూపారు. అందరికంటే అతి తక్కువ ఆదాయం, ఆస్తులున్న ముఖ్యమంత్రి త్రిపుర ముఖ్యమంత్రి. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆస్తుల విలువ కేవలం 26 లక్షలు మాత్రమే అని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు నిర్ధారించాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో మొదటి, నాలుగో స్థానంలో నిలవడం విశేషం.