ఇంతకూ సుజనా కలసినట్లా? కలవనట్లా?

Update: 2018-03-24 03:30 GMT

సుజనా చౌదరి. నిన్నటి దాకా కేంద్రమంత్రిగా పనిచేసిన నేత. ఆయన నిన్న మొన్నటి వరకూ రాష్ట్ర విభజన సమస్యలపైనా, హామీల అమలుపైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేవారు. రాష్ట్రానికి అమలు కావాల్సిన ప్రాజెక్టుల పురోగతిని వివిధ శాఖలకు వెళ్లి పరిశీలించేవారు. వివిధ ఫైళ్ల పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇద్దరు కేంద్రమంత్రుల చేత రాజీనామా చేయించింది. ఎన్డీఏ నుంచి తప్పుకుంది.

అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారా?

ప్రత్యేకహోదాపై పార్లమెంటు సాక్షిగా పోరాటం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అయితే సుజనా చౌదరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ హస్తినలో జోరుగా విన్పిస్తోంది. సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ‌ జైట్లీతో భేటీ కావడం తెలుగుదేశం పార్టీలోనే చర్చనీయాంశమైంది. పోలవరం ప్రాజెక్టు నిధులు, ఇతర పెండింగ్ నిధులతో పాటు రెవెన్యూలోటును కూడా భర్తీ చేస్తామని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.

తాను కలవలేదంటున్న సుజనా.....

ఒక పక్క ప్రత్యేకహోదా కోసం పోరాడుతుంటే కేంద్ర మంత్రులను కలిసే అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అయితే తాను వెళుతుండగా అరుణ్ జైట్లీయే పిలిచి మాట్లాడారని, తనంతట తాను వెళ్లలేదని సుజనా చౌదరి చెబుతున్నారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందని సుజనా చౌదరి ఆరోపిస్తున్నారు. తాను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి మాట్లాడనే లేదని సుజనా చౌదరి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చంద్రబాబుకు తెలియకుండా తాను ఎందుకు కలుస్తానని సుజనా ప్రశ్నిస్తున్నారు. హోదా గురించి కాకుండా ప్యాకేజీ అమలుపై మాట్లాడేందుకే సుజనా అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లారని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి తాను జైట్లీని కలవలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో ఏపీ పార్టీల నేతలు పార్లమెంటులో ఒకలాగా, బయట ఒకలాగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు సర్వత్రా విన్పిస్తున్నాయి. ఇంతకీ సుజనా చౌదరి అరుణ‌ జైట్లీని కలసినట్లా? కలవనట్లా? అన్నది టీడీపీలోనే చర్చనీయాంశంగా మారింది.

Similar News