రెండు కేసులు మరెన్నో మలుపులు.. ఒకటి 2 జీ స్పెక్ట్రం .. రెండు దాణా స్కాం. ఈ రెండింటికీ పోలికలు లేకున్నా వీటిని హ్యాండిల్ చేసింది ద గ్రేట్ సీబీఐ నే .. ఆ రోజు 17 లక్షల కోట్ల స్కాం విషయమై ఏమీ జరగలేదన్న సీబీఐ ప్రత్యేక కోర్టు (పాటియాలా), మాత్రం లాలూ నిందితుడే అని తేల్చడం గమనార్హం.. బహుశా! ఈ కేసుపై రాజకీయ ఒత్తిళ్ల ప్రభావం ఏమీ లేదని అనుకోవాలా?? ఏమో అది కూడా సీబీఐనే చెప్పాలి. కాంగ్రెస్ టు బీజేపీ వీరందరికీ కీలక దర్యాప్తు బృందాలే ఎప్పటికప్పుడు రాజకీయ అవసరాలను తీరుస్తున్నాయా.. తీర్పుని మారుస్తున్నాయా అన్నది నేటి ప్రశ్న.
రెండు దశాబ్దాల కిందట ...
అసలు బీహార్లో ఏ హర్రర్ లేదు అనుకుంటున్న సమయాన ఓ ఉదయం వెలుగు చూసిన ఈ కేసు ఇన్నాళ్లుగా సాగింది. ఇన్నేళ్లలో ఎన్నో మలుపులు తిరిగింది. పాపం ఎందరెందరు సీఎంలు మారారని.. ఆఖరికి లాలూ కూడా విసిగిపోయి ఉండాలేమో! కనుకఇవాళ ఆర్జేడీ పగ్గాలు అందుకోనున్నది తన కొడుకు తేజస్వీనే అని ఓ కబురు మీడియాకు అందించాడు. అంత స్పష్టంగా ఈ ఫలితాన్ని అంచనావేయగలగడం ఓ విధంగా ఒకింత మంచిదే.. ఎందుకంటే ఆయన తన వ్యాఖ్యల ద్వారా పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇవ్వడమే కాక ఈ కేసు విషయమై ఆయనకు ఉన్న కొద్దిపాటి ఆశలు కూడా నీరుగారి పోయి ఉండాలి.లేదా లాలూ అండ్ కో చేసిన లాబీయింగ్ బెడిసి కొట్టైనా ఉండాలి. అందుకనో ఎందుకనో ఈ సారి కోర్టు నిఖార్సైన తీర్పు ఇచ్చిందని అనుకోవాలి.
కుటుంబ స్వామ్య పాలనే అంతిమం...
1991 నుంచి 1994 మధ్య కాలం.. అప్పట్లో లాలూ ఫోర్స్‌కి తిరుగులేదు. ఆ సమయంలో పశువుల దాణా కుంభకోణానికి తెరలేపి.. ఎంచక్కా కోట్ల రూపాయలు దారి మళ్లించారు. 1997లో ఈ సంగతి లోకంలో వెలుగు చూసింది. కానీ అప్పటికే బీహార్ బొక్కసానికి ఈ భోక్తల వలన జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఫలితంగా రబ్రీ దేవి సీన్ లో కి ఎంటర్ అయ్యారు. ఓ నిరక్షరాస్యురాలిగా రాష్ట్రాన్ని ఏలారు. అప్పటి నుంచి అనేకానేక పర్యాయాలు ఈ కేసు వెలుగు చూసినా దర్యాప్తు మాత్రం పుంజుకోలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ కేసుకో ముక్తాయింపు ఇవ్వడం కాస్త శోచనీయమే! ఇక్కడ కూడా జస్టిస్ జరిగిందని అనుకోలేం.ఏమో ఆయన రేపటి వేళ పై కోర్టుకు సవాలుకు వెళ్లనున్నారో లేదో అన్నది తేలాల్సిన విషయం. ఈ దేశ న్యాయవ్యవస్థని బెంచీల వారీగా కుర్చీలవారీగా విభజిస్తే ఒక్కో చోట ఒక్కో విధంగా తీర్పులు వెలువడతాయి అనేందుకు నిన్నటి పాటియాల కోర్టు, నేటి రాంచీ కోర్టు తీర్పులే తార్కాణం. దీజ్ థింగ్స్ ఆర్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అజ్.
రాజా.. దిల్ ఖుష్...
ఇక 2 జీ స్పెక్ట్రం వివాదమై రెండు రోజుల కిందట ఇచ్చిన తీర్పుతో తమిళనాట రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. నాటి కేంద్ర మంత్రి ఈ కేసు ప్రధాన నిందితుడు రాజా అత్యంత భావోద్వేగంతో కరుణానిధి కి రాసిన లేఖలో తానే గెలిచానని, ఈ గెలుపు మీ పాదాల వద్ద ఉంచుతున్నానని ఏవేవో కవితాత్మక వాక్యాలు కొన్ని రాసి తమ బిగ్ బాస్‌కి పంపారు.అలానే కనిమొళి సైతం ఆనందోత్సాహాలు మునిగిపోతున్నారు. ఇవన్నీ బాగున్నాయి. దక్షిణాదిన బీజేపీకి బలం చేకూర్చేందుకు ఇవి సరిపోతాయా కాదు కదా! మళ్లీ మతం కార్డు పాలిటిక్స్ మొదలుపెట్టాలి. ఆ అస్త్రం కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్నందున అప్పుడే ఉపయోగించేశారు కూడా! ఓ బీజేపీ ఎంపీ (మధ్యప్రదేశ్ ఎంపీ చింతామణి మాల్వియా) దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేశ్ ని టార్గెట్ చేస్తూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆయన కర్ణాటక లో ప్రచారం చేయనున్న దృష్ట్యా ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తొలుత గుజరాత్ మాదిరిగానే ఇక్కడ కూడా కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేస్తారన్న వార్తలొచ్చినప్పటికీ వీటన్నింటినీ ఆయన తోసిపుచ్చారు. నేను ఏ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకోను.. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనుకునే కోరిక ఉన్న స్వతంత్ర అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తాను అని అన్నారీయన. ఈ నెల 29 నుంచి ఈయన తన కార్యాచరణ ప్రారంభించనున్నారు. ఏదేతైనేం రెండు కేసుల్లో సీబీఐ గెలిచి ఓడిందని అనుకోకూడదు.. ఓడి గెలిచిందని భావించకూడదు. ఈ దేశంలో గజానికో గాంధారీ పుత్రుడున్నంత కాలం ఇలానే న్యాయం అనేకానేక కాల పరీక్షలను ఎదుర్కోవాల్సిందే!