ఇంత రాద్ధాంతం మధ్యలో రూ.5000 నోట్లు వస్తాయా?

Update: 2016-10-14 02:50 GMT

దేశంలో నల్లధనాన్ని నిరోధించాలంటే.. 500, 1000 రూపాయల నోట్లను నిషేధిస్తే చాలని ఒకవైపు పోరాటం జరుగుతూ ఉంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఈ డిమాండుతో కేంద్రానికి లేఖ రాశారు. దేశంలో నల్లధనాన్ని వెలికి తెప్పించే ప్రయత్నం చాలా చురుగ్గా జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. నల్లధనం కుబేరులకు మరింత సులువుగా ఉండేలా రూ.5000 నోట్లు కూడా ఆర్బీఐ విడుదల చేయబోతున్నదా? అనే ప్రచారం కొన్నాళ్లుగా సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ లో జోరుగా జరుగుతోంది.

అయితే ఆర్బీఐ అధికారులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. గతంలో మన దేశంలో వాడుకలో ఉన్న 5000 నోట్లు మళ్లీ తేబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం మొత్తం ఉత్తుత్తిదే అని, అసలు ఇలాంటి మోసపూరితమైన ప్రచారం ఎలా మొదలైందో కూడా తమకు తెలియదని ఆర్బీఐ అధికార ప్రతినిధి ఓ టీవీ ఛానెల్ కు చెప్పారు.

అయితే పోలీసుల విచారణలో.. ఒక 1000 రూపాయల నోటును, ఫోటోషాప్ లో మార్ఫింగ్ చేసి 5000 రూపాయల నోటుగా తయారుచేసి.. దాని ఫోటోను సర్కులేట్ చేస్తూ ఈ నోట్లను రిజర్వు బ్యాంకు తేబోతున్నదనే ప్రచారం తొ లుత వాట్సప్ గ్రూపుల ద్వారా జరిగిందని తేలింది. ఆ తరవాత ఈ ప్రచార విస్తృతంగా జరిగింది. ప్రధాని ఈ నోట్లను ఆవిష్కరించబోతున్నారని కూడా ప్రచారం జరిగింది.

ఒకవైపు దేశంలో నల్లధనానికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతూ ఉంటే.. నల్లధనం ఎక్కడఉన్నా పొగబెట్టి దానిని బయటకు తేవడానికి కేంద్రం ఒకవైపు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటే.. అందుకు పెద్ద డినామినేషన్ నోట్లను నిషేధించడం ఒక్కటే మార్గం అని చాలా మంది నిపుణులు సూచిస్తూ ఉండగా.. ఇలాంటి సమయంలో 5000 డినామినేషన్‌తో నోట్లు తేవడం అనేది కేవలం ఊహాజనితం. ఇదంతా ఎవరో ఆకతాయిలు పుట్టించిన ప్రచారం అయి ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

Similar News