కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసినవి రాబట్టడంలో చంద్రబాబు సర్కారు తీవ్రంగా విఫలమైన మాట వాస్తవం. ప్రజలందరూ స్పష్టంగా గుర్తిస్తున్న వైఫల్యాన్ని కనీసం పాలకులు ఒప్పుకున్నా వారికి పరువుగా ఉండేదేమో గానీ.. ప్రతిసారీ ఏదో కబుర్లు చెప్పి ప్రజలను నమ్మించాలని ప్రయత్నించడమూ , బుకాయించాలని ప్రయత్నించడమూ జరుగుతూ ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే వరకు , హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే బుకాయించింది. ప్యాకేజీ వచ్చిన తరవాత దానికి చట్టబద్ధత విషయంలో అలాగే బుకాయిస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్ల పెంపు గురించి ‘ఇప్పట్లో సాధ్యం కాదంటూ’ కేంద్రం పార్లమెంటులో స్పష్టం చేసిన తర్వాత.. ‘అబ్బెబ్బే అలా అన్లేదు.. ఇలా అన్నారు’ అంటూ అందులో మడత పేచీలు బయటకు లాగి బుకాయిచండానికి ఏపీ ఆర్థిక మంత్రి యనమల ప్రయత్నిస్తుండడం విశేషం.
ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే సీట్ల పెంపు అనేది రెండు రాష్ట్రాల్లోనూ పాలక పార్టీలకు చాలా అవసరం. కేవలం పెరిగేసీట్లను తాయిలంలాగా ఆశ చూపించి, వీరు ప్రత్యర్థి పార్టీలను ఖాళీ చేసే యజ్ఞం చేపట్టారు. ఎడాపెడా తమ పార్టీలోకి జంప్ చేసే వారినందరినీ చేర్చేసుకున్నారు. ఏపీలో అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఆధిప్యత పోరాటాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సీట్లు పెరగకపోతే,.. తెదేపాకు గడ్డు రోజులు తప్పవు. పైగా తమ పార్టీలోకి ఇంకా ఫిరాయింపుల్ని వారు ఆశిస్తున్న నేపథ్యంలో .. అసలు సీట్లు పెరగవని తెలిస్తే రాదలచుకున్న వారు కూడా సంకోచిస్తారు.
అందుకే కాబోలు.. యనమల రామకృష్ణుడు, పార్లమెంటులో కేంద్రమంత్రి చేసిన ప్రతికూల ప్రకటనకు తనదైన శైలిలో భాష్యం చెబుతూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం సీట్ల పెంపు కుదరదు అని చెప్పలేదని, సీట్ల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరం అని మాత్రమే స్పష్టం చేసిందని యనమల రామకృష్ణుడు అంటున్నారు. అయితే ఇవన్నీ కూడా ఆశావహుల్ని మరికొంత కాలంపాటూ ఆశల డోలికల్లో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నాలే తప్ప.. ఆచరణలో సాధ్యం అయ్యేవి కాదని.. విభజన చట్టంలో ఉన్న అంశాలనే కేంద్రం ద్వారా సాధించుకోలేని దయనీయ స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కారు.. కొత్తగా తమ కోసం రాజ్యాంగ సవరణ చేసేంత చొరవతో కేంద్రం ద్వారా పనిని చక్కబెట్టుకోవడం అసాధ్యం అని విశ్లేషకులు భావిస్తున్నారు.