పెద్ద నోట్లు రద్దయినా ఇంకా పాత నోట్లు లక్షలకు లక్షలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా అమీర్ పేటలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టయింది. 40 శాతం కమీషన్ కు పాత నోట్లను మార్చి కొత్త నోట్లను ఇస్తానని చెప్పి మోసం చేసిన ముఠాను పోలీసులు వల వేసి పట్టుకున్నారు. పాతబస్తీకి చెందిన అమీర్ ఖాన్ అనే వ్యాపారి వద్ద 59 లక్షలు విలువచేసే రద్దయిన పాతనోట్లున్నాయి. ఈ వ్యాపారికి వలవేసింది ఒక ముఠా.
పాత నోట్లు రద్దయినా ఇంకా తనవద్దే ఉంచుకున్న అమీర్ ఖాన్ ఈ ముఠా వలలో పడిపోయాడు. పాత నోట్లు తీసుకుని ముఠా పరారైంది. దీంతో అమీర్ ఖాన్ ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పాతనోట్లను తీసుకున్న ఈ ముఠా ఏం చేస్తారో తెలియడం లేదు. పోలీసుల విచారణలో బయటపడనుంది. అలాగే వ్యాపారి అమీర్ ఖాన్ వద్ద కూడా ఇంత పెద్దమొత్తంలో రద్దయిన నోట్లు ఉండటంపైన కూడా పోలీసులు విచారిస్తున్నారు.