ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు.. అక్కడికక్కడే అగ్నికీలల మధ్య సమాది అయ్యారు. ఒరిస్సా భువనేశ్వర్ లని ఎస్‌యూఎం ఆస్పత్రిలో సోమవారం రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 22 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 70 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని కూడా అనుమానిస్తున్నారు. ఆస్పత్రి ఐసీయూ నుంచి చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి అయిదు ఫైరింజన్లతో పోరాడుతున్నారు.
భువనేశ్వర్ లోని ఎస్‌యూఎం ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్ ఉన్న ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ వలన అగ్నిప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఐసీయూలో చెలరేగిన మంటలకు రోగులు ఎటూ తప్పించుకోలేని పరిస్థితిల్లో అక్కడికక్కడే మరణించారు. మిగిలిన అంతస్తుల్లోనూ వందల మందిరోగులు, వారి సహాయకులు చిక్కుకుని.. మంటలను అదుపు చేసే చర్యలను బిక్కు బిక్కు మంటూ గమనిస్తున్నారు.
గాయపడిన వారిని భువనేశ్వర్లోని ఎయిమ్స్ ఆస్పత్రికి, మరియు కొన్ని ఇతర ప్రెవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
భద్రత ఎండమావేనా?
భువనేశ్వర్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం మన తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి ఆస్పత్రులలో ఉన్న భద్రత ఏర్పాట్లను కూడా తరచుగా సమీక్షించుకుంటూ ఉండవలసిన ఆవశ్యకతను తెలియజెబుతోంది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు భద్రత ఎండమావేనా? అనే భయం కలుగుతోంది. ఇప్పటికే మన రాష్ట్రాల్లో కనీసం కరెంటు వసతి సక్రమంగా ఉండక కొవ్వొత్తి వెలుగుల్లో ఆపరేషన్లు పూర్తిచేసిన ఏరియా ఆస్పత్రులు కూడా కొన్ని ఉన్నాయి. ఇలాంటి అవకతవకలు మన ఆస్పత్రుల నిర్వహణ పరంగా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ప్రమాదాలు జరిగే వరకు నిరీక్షించకుండా, ఆ తర్వాత విచారించే పరిస్థితి లేకుండా.. ముందు జాగ్రత్తగానే తరచూ ఆస్పత్రులను , భద్రత ఏర్పాట్లను సమీక్షించుకుంటూ ఉండాలని ప్రజలు కోరుతున్నారు.