రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ ఉప ఎన్నికలు చాలు కమలనాధులు రోజురోజుకూ ఎంత బలహీనపడుతున్నారో చెప్పడానికి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రంలోనూ మోడీ ప్రభుత్వమే. ఇక ఉప ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలవుతున్నట్లు? సాధారణంగా ఎక్కడైనా ఉప ఎన్నికలు జరిగితే అధికార పార్టీకి అడ్వాంటేజీగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనీ, మజిల్ పవర్ ను ఉపయోగించి మరీ ఆ స్థానాలను చేజిక్కించుకుంటాయి. అలాంటిది అధికారమున్న చోటే నవ్వుల పాలయిన కమలం పార్టీ వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కొనబోతుందన్నదే ప్రశ్న.
రెండు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో.....
రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు ఈ ఏడాదే జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో గత నాలుగున్నరేళ్ల నుంచి కమలం పార్టీ కొలువుదీరి ఉంది. అదే సమయంలో మూడున్నరేళ్ల నుంచి కేంద్రంలో మోడీ పాలన సాగిస్తున్నారు. ఎన్నో సంస్కరణలు తెచ్చామన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి నల్లధనాన్ని వెలికితీశామన్నారు. జీఎస్టీని తెచ్చి పన్నుల మదింపుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆల్ హ్యాపీస్ అనుకున్న సమయంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాలు కమలనాధులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
వీరిద్దరిదే బాధ్యత....
పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లదే హవా. ఇది కాదనలేని వాస్తవం. మొండోడు రాజు కంటే బలవంతుడు అన్న సామెతగా ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా, పార్టీ నేతలను, మిత్రపక్షాలను కూడా పక్కన పెట్టి మరీ రాజ్యమేలుతోంది ఈ జోడీ. అందుకే మిత్రులు కూడా ఒక్కొరొక్కరూ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. రానున్న కాలంలో దేశం మొత్తం కాషాయ రంగు పులుముతామని చెబుతున్న ఆ పార్టీ పాలించే రాష్ట్రంలోనే చతికిలపడే పరిస్థితికి వచ్చిందంటే దీనికి ప్రధాన బాధ్యత వీరిద్దరే వహించాలన్నది పార్టీలో కొందరి నేతల అభిప్రాయం.
రాజేను తప్పించలేక పోవడానికి....
రాజస్థాన్ లో ఇటీవల జరిగిన రెండు పార్లమెంటు స్థానాలకు, అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలవ్వడాన్ని రాష్ట్ర పార్టీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యమంత్రి వసుంధర రాజేను పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్ కూడా చేశారు. కాని పార్టీ అధిష్టానం ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఓటమి కారణాలపై విశ్లేషణలు జరిపి మౌనం వహించింది. రాజేను తప్పించేంత సాహసాన్ని కూడా ఇప్పుడు ఈ జోడీ చేయకపోవడానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయంటున్నారు. వసుంధరను ఎన్నికలకు ముందు తప్పిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయితే అది తమ ఖాతాలోనే పడుతుంది. వసుంధరను కొనసాగించి ఎన్నికలకు వెళితే ఓటమి పాలయినా అది ఆమె మీదకు తోసెయ్యొచ్చు. అందుకే రాజేను పదవి నుంచి తప్పించేందుకు ఆ ఇద్దరూ ఇష్టపడటం లేదన్న వ్యాఖ్యలూ విన్పిస్తున్నాయి.
చౌహాన్ పై వ్యతిరేకతతోపాటు.....
ఇక తాజాగా జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ పార్టీ ఓటమి పాలవ్వడం కమలనాధులకు షాక్ అని చెప్పకతప్పదు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై ఇప్పటికే వివిధ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రధానంగా రైతులు ఆయన పాలన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులపై కాల్పుల ఘటన కూడా ఆయనపై వ్యతిరేకత పెరగడానికి మరో కారణంగా చూపుతున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కూడా ప్రభావితం చేశాయంటున్నారు. దీనివల్లనే తాజాగా జరిగిన ముంగోలి, కొలారస్ స్థానాల్లో బీజేపీ ఓటమి పాలయిందంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించడం అధికారపార్టీకి కనువిప్పు కావాలని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. మొత్తం మీద మోడీ, అమిత్ షా జోడీ రెండు రాష్ట్రాల ఉప ఎన్నికల తీర్పుతోనైనా తీరు మార్చుకోక తప్పదంటున్నారు.