ఆర్కేనగర్ విజేత వీరేనా?

Update: 2017-12-24 00:30 GMT

ఉత్కంఠ రేపుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 77.5 శాతం ఓటింగ్ నమోదయింది. దీంతో అధికారులు కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జయలలిత మృతితో ఏర్పడిన ఆర్కే నియోజకవర్గం ఉప ఎన్నిక ఏడాది తర్వాత జరిగింది. ఎట్టకేలకు కట్టుదిట్టమైన భద్రత... ఎన్నికల కమిషన్ నిఘా మధ్య ఈ ఎన్నిక జరిగింది. అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రజల నుంచి ఓటింగ్ కు మంచి స్పందన లభించింది.

వీడియో విజయం తెస్తుందా?

ఆర్కే నగర్ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ నెలకొంది. ముఖ్యంగా అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్, డీఎంకే అభ్యర్థి మరదు గణేశ్ ల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. అయితే పోలింగ్ సందర్భంగా జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పాలు తాగుతున్న ఒక వీడియోను దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే వెట్రివేల్ విడుదల చేశారు. వెట్రివేల్ పై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. వివరణ కూడా కోరింది. అయితే ఈ వీడియో అప్పటికే వైరల్ గా మారి సంచలనమయింది. ఈ వీడియో తనకు విజయం తెచ్చిపెడుతుందని దినకరన్ వర్గం నమ్మకంగా ఉంది. ప్రయివేటు సంస్థలు జరిపిన సర్వేలు కూడా దినకరన్ దే విజయమని చెబుతున్నాయి.

తీర్పు ఒడ్డున పడేస్తుందా?

ఇక డీఎంకే పార్టీకి పోలింగ్ రోజునే శుభవార్త అందింది. 2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే నేతలైన కనిమొళి, ఎ.రాజాలకు కేసు నుంచి విముక్తి లభించింది. అప్పటి వరకూ ఈ కేసుతో అవినీతిపార్టీగా ముద్రపడిన డీఎంకేకు అది తొలగిపోయినట్లయిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ తీర్పు కూడా పోలింగ్ పై ప్రభావం చూపుతుందని డీఎంకే నేతలు ఆశిస్తున్నారు. తీర్పు వెలువడిని తర్వాత పోలింగ్ జరుగుతున్న ఆర్కే నగర్ లో కూడా డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకోవడం విశేషం. అన్నాడీఎంకేలో చీలిక రావడంతో తమ గెలుపు ఖాయమని డీఎంకే గట్టిగా నమ్ముతుంది.

గుర్తు...గుర్తుంచుకుంటారా?

మరో ముఖ్యమైన పార్టీ అన్నాడీఎంకే. పార్టీని, గుర్తును చేజిక్కించుకున్న పళనిస్వామి వర్గం ఇక్కడ అభ్యర్థిగా మధుసూదనన్ ను పోటీకి దింపింది. మధుసూదనన్ గతంలో ఇక్కడ ప్రాతినిథ్యం వహించిన వారే. అంతేకాదు మధుసూదనన్ ది నెల్లూరు జిల్లా కావడం కూడా కొంత అవకాశాలున్నాయంటున్నారు. ఆర్కేనగర్ లో దాదాపు 60 శాతం మంది ఓటర్లు తెలుగు వాళ్లే. అందుకే మధుసూదనన్ తన గెలుపుపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. దీంతో పాటు పార్టీ గుర్తు రెండాకులు తనకు విజయాన్ని అందిస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఇక్కడ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు.

కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి....

ఆర్కే నగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. క్వీన్ మెరీస్ కళాశాలలో మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ కళాశాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం 19 రౌండ్లలో ఆర్కే నగర్ ఓట్లను లెక్కించనున్నారు. అభ్యర్థులు, ఏజెంట్లకు ప్రత్యేకంగా పాస్ లను ఇచ్చారు. వారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. మొత్తం మీద ఎవరికి వారే గెలుపు పై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి ఓటర్లు ఎవరి వైపు ఉన్నారనేది మరికాసేపట్లో తేలనుంది.

Similar News