ఆర్కేనగర్ లో కమల్ దిగుతారా?

Update: 2017-10-18 16:30 GMT

కమల్ హాసన్ వేగంగా పావులు కదుపుతున్నారు. రాజీకీయాల్లోకి త్వరగా వచ్చేయాలని భావిస్తున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘంసిద్దమవుతుండటంతో ఇక్కడ పోటీ చేయాలని కూడా కమల్ భావిస్తున్నట్లు సమాచారం. కమల్ పార్టీ తరుపున ఎవరో ఒకరిని బరిలోకి దింపాలని హాసన్ యోచిస్తున్నారు. ఈ మేరకు కొందరు మిత్రులు, సన్నిహితులతో చర్చించినట్లు తెలిసింది. అయితే ఉప ఎన్నికల్లో కంటే సాధారణ ఎన్నికల్లోనే బరిలోకి దిగడం మంచిదని కొందరు సూచించారు. అయితే దీనిపై ఇంకా కమల్ ఒక నిర్ణయానికి రాలేదంటున్నారు. వంద రోజుల్లో ఎన్నికలు వచ్చినా తాను సిద్ధమేనని గతంలో కమల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకే ఆర్కే నగర్ ఉప ఎన్నికపై కమల్ సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆర్కే నగర్ చెన్నైని ఆనుకునే ఉండటం తనకు కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు కమల్. పట్ణణ ప్రాంత ఓటర్లు అధికార పార్టీపై విసిగిపోయి ఉన్నారని, ఈ దశలో ఉప ఎన్నికలో బరిలోకి దిగితే ఎలా ఉంటుందని కొందరు సీనియర్ జర్నలిస్ట్ లను కూడా కమల్ సంప్రదించినట్లు తెలిసింది. అయితే దీనిపై కమల్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు.

మోడీకి మద్దతిచ్చి తప్పుచేశా.....

ప్రధాని మోడీకి మద్దతిచ్చి తాను తప్పుచేశానని, ప్రజలు తనను క్షమించాలని విలక్షణ నటడు కమల్ హాసన్ కోరారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. నోట్ల రద్దు విషయంలో మోడీని కమల్ వెనకేసుకొచ్చారు. పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి పరుల ఆటలు సాగవని కమల్ అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మోడీ నిర్ణయం పై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు కమల్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పాలయింది సామాన్య ప్రజలేనని, రాజకీయనాయకులు లబ్ది పొందారని కమల్ ఆరోపించారు. తనను అప్పట్లో కొందరు కమ్యునిస్టు నేతలు హెచ్చరించాని వారి మాటలు వినకుండా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్ధించాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు తాను చేసిన తప్పు తెలిసి వచ్చిందని, ప్రజలు తనను క్షమించాలని కమల్ కోరుకున్నారు. ఆయన ఒక తమిళ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద కమల్ బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో కూటమిని ఏర్పాటు చేయాలన్న యోచనలో కూడా ఉన్నారు.

Similar News