ఆర్కేనగర్ పూర్తిగా టైట్ అయింది....!

Update: 2017-12-09 18:29 GMT

ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఈసారి ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకసారి నవ్వులపాలయి ఉప ఎన్నిక రద్దు కావడంతో ఈసారి అలా జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. అంతేకాకుండా నిబంధనలను కూడా కఠినతరం చేసింది. ఇక అభ్యర్థి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే అనర్హత వేటు తప్పదని హెచ్చరించింది. గతంలో వివిధ పార్టీలు ఓటర్లకు ఓట్ల స్లిప్ లు అందించేవారు. వీటిని బూత్ స్లిప్ లు అంటారు. అభ్యర్థులు బూత్ స్లిప్ లతో పాటు గతంలో నగదును కూడా జత చేసి ఇచ్చేవారన్న ఆరోపణలు రావడంతో ఈసారి బూత్ స్లిప్ ల పంపిణీ బాధ్యతను ఎన్నికల కమిషన్ తీసుకుంది. ఈ నెల 12వ తేదీ నుంచి ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఎణ్నికల సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి బూత్ స్లిప్ లను పంపిణీ చేయనున్నారు.

ఖర్చు దాటిందంటే అనర్హత వేటే....

గత ఏప్రిల్ నెలలో విడుదలయిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు స్వతంత్ర అభ్యర్థి దినకరన్ దాదాపు 90 కోట్ల రూపాయలు పంచారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్కే నగర్ లో అనేక ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. మంత్రులు, వీవీఐపీల వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఒక్కొక్క అభ్యర్థి 28 లక్షల వరకూ ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవచ్చు. అయితే దానికి మించి ఖర్చు చేస్తే అనర్హత వేటు వేస్తామని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఎన్నికల ప్రచారానికి వినియోగించే వాహనాలు, వారి వెంట వచ్చే అభ్యర్థుల వివరాలను కూడా ముందుగానే ఎన్నికల కమిషన్ కు తెలియపర్చాలి. వారు ఇచ్చిన విధంగా కాకుండా ఎక్కువ మంది వచ్చినా రెండు సార్లు హెచ్చరిక జారీ చేస్తారు. మూడో సారి ప్రచారాన్ని నిషేధిస్తామని తమిళనాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజేశ్ లఖాని తెలిపారు. మొత్తం మీద ఈ సారి ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బు ఏరులై పారకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆర్కే నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేలుస్వామిని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ తొలగించింది. విశాల్ నామినేషన్ తిరస్కరణపై ఈసీ సీరియస్ అయింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆర్కే నగర్ లో రాజకీయ పార్టీల పప్పులుడకకుండా చేసేందుకు ఈసీ చేస్తున్న ప్రయత్నాలు ఈసారైనా ఫలిస్తాయో లేదో చూడాలి.

Similar News