ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ కూడా సై అంటుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చింది. పార్టీ అధ్యక్షురాలు తమిళ సై, పార్టీ నేత హెచ్ రాజా పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది. గత ఏప్రిల్ లో ఆర్కే నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బీజేపీ తరుపున గంగై అమరన్ పోటీ చేశారు. ఈ సారి పోటీకి ఆయన విముఖత చూపడంతో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. అయితే అప్పట్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారన్న ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికను రద్దు చేశారు. ఎనిమిది నెలల తర్వాత తిరిగి ఆర్కే నగర్ ఉపఎన్నిక జరగబోతోంది అయితే ఆర్కే నగర్ లో పోటీ మూడు పార్టీల మధ్యనే ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. అన్నాడీఎంకే, శశికళ వర్గం, డీఎంకే వర్గాల మధ్యనే పోరు ఉంటుంది. ఈ ముగ్గురిలో ఒకరికే విజయం లభిస్తుందన్నది అంచనా. అయితే ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
డీఎంకే కు లాభమా?
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే తరుపున మధుసూదనన్, శశికళ వర్గం అభ్యర్ధిగా టీటీవీ దినకరన్, డీఎంకే అభ్యర్ధిగా మరదు గణేశ్ పోటీ చేస్తున్నారు. డీఎంకే ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు చీల్చే ఓట్లతో తమ గెలుపు సునాయాసం అవుతుందని ఆ పార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారు. మరోవైపు అన్నాడీఎంకే అభ్యర్ధి మధుసూదనన్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. తాను గతంలో చేసిన అభివృద్ధి, అమ్మ ఆశీర్వాదదం తనను గెలిపిస్తాయని ఆయన చెబుతున్నారు. మరోవైపు దినకరన్ కూడా గెలుపు తమదేనంటున్నారు. జయలలితను కంటికి రెప్పలా కాపాడుకున్న శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి బయటకు పంపడాన్నిప్రజలు ఏవగించుకుంటున్నారన్నారు. దీంతో విజయం తమదేనని చెబుతున్నారు దినకరన్. ఏదైనా దినకరన్ కు ఇది జీవన్మరణ సమస్య. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే ఉన్న ఎమ్మెల్యేలు పళనిస్వామి వైపుకు పోకుండా ఉంటారు. కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చే అవకాశముంటుంది. చిన్నమ్మ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారని ప్రచారం చేసుకోవచ్చు. అందుకే దినకరన్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే దినకరన్ ఆర్కే నగర్ లో ప్రచారం ప్రారంభించారు. మొత్తం మీద ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఉత్కంఠను రేపుతోంది.