ఆర్కే నగర్ ఎంత పనిచేసింది?

Update: 2018-01-02 17:30 GMT

ఆర్కేనగర్ ఉప ఎన్నిక అధికార, విపక్ష పార్టీల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే పార్టీ ఇప్పటికే 130 మందికిపైగా నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా, ప్రతిపక్ష డీఎంకే కూడా చర్యలకు దిగింది. తమ అభ్యర్థి మరదు గణేశ్ కు డిపాజిట్ దక్కకపోవడానికి సొంత పార్టీ నేతలే కారణమని పార్టీ విశ్లేషణలో బయటపడింది. దీంతో డీఎంకే 154 మందిని పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ డీఎంకే ఆదేశాలు జారీ చేసింది. మరదు గణేశ్ ఓటమిపై డీఎంకే హైలెవెల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆరు రోజులపాటు ఆర్కే నగర్ లో పర్యటించి ఓటమికి గల కారణాలను విశ్లేషించి హైకమాండ్ కు నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా వివిధ పదవుల్లో ఉన్న 154 మందిని పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనం కల్గించింది.

శాసనసభ సమావేశాల్లో....

మరోవైపు ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో అన్నాడీఎంకే శాసనసభ సమావేశాల్లో వ్యూహరచనకు దిగింది. రేపు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు భేటీ అవుతున్నారు. ఈ భేటీలో శాసనసభలో దినకరన్ ను కట్టడి చేయడానికి అనుసరించిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. మరోవైపు రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఈ నెల7వ తేదీన డీఎంకే కూడా శాసనసభ్యులతో సమావేశం కానుంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి స్టాలిన్ ఈ సమావేశంలో శానసభ్యులతో చర్చించనున్నారు.

రజనీ సమస్య మరోవైపు....

ముఖ్యంగా ఆర్కేనగర్ ఉప ఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికలు ఇప్పటికిప్పుడు లేకపోయినా తమ నాయకత్వ పటిమపై ప్రజలకు అనుమానం కలుగుతుందన్న ఆందోళన రెండు పార్టీల నేతల్లో బయలుదేరింది. మరోవైపు టీటీవీ దినకరన్ దూకుడుకు కళ్లెం వేయడానికి అన్నాడీఎంకే సిద్ధమైంది. దినకరన్ వర్గంగా భావిస్తున్న తొమ్మిది మంది నేతలపై అధికార అన్నాడీఎంకే చర్యలకు దిగింది. మొత్తం మీద ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటమి, రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ప్రకటన ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేకు ఊపిరి సలపినివ్వడం లేదు.

Similar News