ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దును భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే , అరుణక్క ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం లభించడంతో ఏవోబీ ప్రాంతాన్ని ఏపీ, తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ గ్రే హౌండ్స్ బలగాలు సంయుక్తంగా చుట్టు ముట్టాయి. గత కొంత కాలంగా ఏవోబీలో మావోల కార్యక్రమాలు స్తబ్దుగా వున్నాయి. ఇటీవలే చర్ల , దుమ్ముగూడెం, వాజేడు, భూపాలపల్లి జిల్లా వెంకటాపురం ప్రాంతాల్లో మావోయిస్టు లు పెద్ద ఎత్తున కరపత్రాలు పంపిణి చేశారు.
గ్రీన్ హంట్ వేగవంతం ...
మావోయిస్టులను సమూలంగా ఏరివేయడమే లక్ష్యంగా ఆపరేషన్ గ్రీన్ హంట్ కార్యక్రమాన్ని కేంద్రం వేగవంతం చేసింది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలను ఈ ఆపరేషన్ లకు సంయుక్తంగా వినియోగిస్తున్నారు. వీరికి తోడు కేంద్ర భద్రతా బలగాలకు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన వారిని రంగంలోకి దించుతున్నారు. ఇలా ముప్పేట దాడి తో వ్యూహరచన చేస్తూ సాగిస్తున్న ఆపరేషన్ల ఫలితంగా చాలా రాష్ట్రాల్లో నక్సల్స్ కార్యకలాపాలు మందగించాయి. దాంతో ఉనికి కోసం మావోయిస్టు లు సరికొత్త గా భారీ దాడులకు సిద్ధమౌతున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఆ విధ్వంసాన్ని ముందుగానే పసిగట్టి నిర్వీర్యం చేయడంతో బాటు అగ్రనేతలను మట్టుబెట్టి వారి ధైర్యాన్ని స్థైర్యాన్ని దెబ్బతీసే పనిలో భద్రతా బలగాలు సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని మన్యం ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా వున్నాయి. ఏ క్షణంలో ఏమి జరగబోతుందో అన్న ఆందోళనలో గిరిజనం బిక్కు బిక్కుమంటున్నారు.