దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరుషి హత్యకేసులో నిందితులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారి తల్లిదండ్రులు రాజేష్, నుపుర్ తల్వార్లను నిర్దోషులుగా ప్రకటించింది. వారు ఆరుషిని హత్య చేశారని చెప్పడానికి సీబీఐ తగిన సాక్ష్యాధారాలను సమర్పించలేదని పేర్కొంది. అందుకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. 2008లో ఆరుషితో పాటు పనిమనిషి హేమరాజ్ కూడా హత్య కు గురయ్యాడు.ఈ జంట హత్యలకు కారణమెవ్వరన్నది తేలకపోవడం విశేషం.
మీడియా అత్యుత్సాహమేనా?
2008 మే 16వ తేదీన ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయువిహార్‌లో సెక్టార్ 25లో డాక్టర్ ఎస్ తల్వార్ కుమార్తె దారుణ హత్యకు గురైందన్న వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యకు జాతీయ మీడియా కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆరుషి హత్య వెలుగులోకి వచ్చిన వెంటనే మీడియా శోధనలో పని మనిషి కనిపించడం లేదన్న నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆరుషిని బలవంతం చేసిన పని మనిషి హేమరాజ్... ఆరుషి ఒప్పుకోకపోవడంతో హత్యకు పాల్పడి ఉంటాడంటూ రకరకాలైన కథనాలను మీడియా ప్రసారం చేసింది. హంతకుడిగా హేమరాజ్‌ను నిర్ధారించిన మీడియాకు మరుసటి రోజే టెర్రస్ మీద హేమరాజ్ విగతజీవిగా కనిపించడంతో విస్తుపోవడం మీడియా వంతైంది. దీంతో కేసు మరో మలుపు తిరిగింది.అప్పటివరకు పనిమనిషే హత్యకు పాల్పడ్డాడని ఊహించిన పోలీసులు, మీడియా అసలేం జరిగి ఉంటుందని మరింత లోతుగా అధ్యయనం చేశారు. దీంతో ఆరుషికి, హేమరాజ్‌కు అక్రమ సంబంధం ఉందని... ఆ సంబంధాన్ని అంగీకరించని కుటుంబ సభ్యులే వారిద్దరినీ హతమార్చారని ఒక వాదాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. మరో వైపు హేమరాజ్ బంధువులు రాజేష్ తల్వార్ క్లినిక్‌లో పనిచేసే మరో ఇద్దరిపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. వీరిద్దరూ ఆరుషి మీద కన్నేసి, ఇంటిలోకి దూరి అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె ఒప్పుకోకపోవడంతో హత్య చేశారని... ఆ హత్యను హేమరాజ్ చూడటం వల్లే అతనిని కూడా హత్య చేశారన్న అనుమానం వ్యక్తం చేశారు.
సీబీఐ శోధించలేక.....
ఆరుషి తల్లిదండ్రులు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. అయితే, అప్పటి ఎస్పీ మాత్రం ఇది ముమ్మాటికీ ఆరుషి తల్లిదండ్రులపనే అని బల్లగుద్ది వాదించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఎస్పీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతన్ని బదిలీ చేసి కేసును సీబీఐకి బదలాయించింది. కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సీబీఐ కోర్టు... ఆరుషి తల్లిదండ్రులకు ఏ పాపం తెలియదని భావిస్తూ జైలులో ఉన్న రాజేష్ తల్వార్‌కు బెయిలు మంజూరు చేసింది.అనంతరం చేసిన శోధనలో సీబీఐ పలు ఆసక్తికర అంశాలను వెలికి తీసింది. ఈ క్రమంలో తొలుత పని మనుషులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ఆలోచించి వారికి నార్కో టెస్టులు కూడా నిర్వహించింది. ఆ టెస్టు వివరాలను నిందితుల తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించి వారిని నిర్దోషులుగా తేల్చారు. తదనంతర విచారణలో 14 ఏళ్ల ఆరుషిని ఆమె తండ్రి రాజేష్ తల్వార్ హత్య చేయగా, తల్లి నుపూర్ తల్వార్ సాక్ష్యాలను తారుమారు చేసిందని సీబీఐ నిర్థారించింది.సీబీఐ సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం వారిద్దరిని హంతకులుగా పేర్కొంటూ తీర్పును వెలువరించింది. అయితే తాజా తీర్పు తో ఆరుషి తల్లిదండ్రలు నిర్దోషులుగా తేలడంతో అసలు నిందితులు ఎవరన్నది తేలలేదు. దీనిపై సీబీఐ స్పందిస్తూ కేసు పూర్తి పాఠం చదివిన తర్వాత తాము దీనిపై తదుపరి చర్యలకు దిగుతామని ప్రకటించింది. ఆరుషి తల్లిదండ్రులు కూడా ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందన్నారు.