తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కావాలనే తమ నుంచి విడిపోయి వెళ్లిపోయారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డారు. తాము ఆంధ్రప్రదేశ్ కు ఎంతో చేశామని, అవేమీ చూడకుండా చంద్రబాబు కావాలనే ఎన్డీఏ నుంచి వైదొలగారని షా అన్నారు. ఆయన టైమ్స్ నౌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించారు. ఏపీకి తాము ఎంతో చేశామని, ఇంకా చేయాలని ఉందని, అయినా ఆయనంతట ఆయనే బయటకు వెళ్లారన్నారు.
ప్రతి పైసాకు లెక్కలు చెబుతాం....
ఏపీకి నాలుగేళ్లలో ఇచ్చిన నిధులను ఏ రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా నాలుగేళ్లలో అన్ని నిధులు ఏ ప్రభుత్వమూ విడుదల చేయలేదని అమిత్ షా అభిప్రాయపడ్డారు. గత నాలుగేళ్లలో ఏపికి ఇచ్చిన నిధులను ప్రతిపైసాకు లెక్క చెబుతామని షా సవాల్ విసిరారు. తాము చంద్రబాబును వెళ్లగొట్టలేదని, ఆయన తనంతట తాను ఎన్డీఏ ను విడిచి వెళ్లిపోయారన్నారు. ఏపికి న్యాయం చేసేందుకు తాము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామన్నారు.
వచ్చే ఎన్నికల్లోనూ.....
చంద్రబాబు వెళ్లిపోయినంతమాత్రాన ఎన్డీఏ బలహీన పడలేదన్నారు షా. ఇంకా ఎన్డీఏలో 30 పార్టీలున్నాయని గుర్తు చేశారు. మిత్రపక్షాలను ఎలా చూసుకోవాలో మాకు తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో సయితం ఎన్డీఏ కూటమి 300కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్డీఏ ను విడిచి వెళ్లిపోయిన తర్వాత తాము అక్కడ బలపడవచ్చేమో అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమకు ఏపీలో రెండు పార్లమెంటు స్థానాలే ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో అవి పెరిగే అవకాశాలనూ కొట్టిపారేయలేమన్నారు. పార్లమెంటులో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, కాని కొన్ని పక్షాలు చేస్తున్న ఆందోళన వల్లనే అవిశ్వాసం చర్చకు రావడం లేదన్నారు.