ఆయన మాటల వల్లే అంతా

Update: 2018-03-07 17:38 GMT

కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు వైదొలగడానికి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ కారణమని చెప్పక తప్పదు. అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినప్పుడు కూడా కేంద్రానికి మూడు రోజుల సమయం ఇచ్చే విధంగా మాట్లాడారు. మూడు రోజుల్లో విభజన చట్టంలోని 19 అంశాలను నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అమరావతిలో పరిణామాలు చకచకా జరిగిపోయాయి. జైట్లీ ప్రెస్ మీట్ చూసిన చంద్రబాబు పూర్తి అసంతృప్తులకు లోనై మంత్రులందరితో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించారు. ఎంపీలందరూ ఎన్డీఏ నుంచి బయటకు రావాలని చెప్పారు. తర్వాత మంత్రులు యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, లోకేష్ లతో గంటకు పైగా చర్చించిన అనంతరం చంద్రబాబు కేంద్రమంత్రివర్గం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో జైట్లీ ప్రకటనే పుండుమీద కారం చల్లినట్లుగా ఉండటంతో వెంటనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Similar News