ఏడేళ్ల తర్వాత మళ్లీ పెద్దాయన రంగంలోకి దిగారు. అవినీతిని రూపుమాపేందుకు లోక్ పాల్ ను నియమించాలని ఆయన కొన్నేళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. కాని ఏ ప్రభుత్వమూ ఆయన డిమాండ్ ను పట్టంచుకోలేదు. సామాజిక కార్యకర్త అన్నాహజారే మరోసారి ఆమరణదీక్షకు దిగారు. సమర్థవంతమైన లోక్ పాలను నియమించాలని, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ ఆయన ఈ దీక్షకు దిగారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అన్నాహజారే శుక్రవారం ఉదయం ఆమరణ దీక్షను ప్రారంభించారు.
ఏడేళ్ల తర్వాత....
అవినీతికి వ్యతిరేకంగా 2011లో అన్నాహజారే ఆమరణ దీక్షకు దిగారు. అప్పట్లో అన్నాహజారే దీక్ష దేశవ్యాప్తంగా సంచలనమయింది. దేశంలో అవినీతిని తరిమేయాల్సిందేనంటూ ముఖ్యంగా యువత ఆయనకు దన్నుగా నిలిచింది. ఆయనకు మద్దతుగా అన్ని వర్గాలూ నిలిచాయి. అప్పటి దీక్షలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మద్దతు పలికాయి. అన్నాహజారే దీక్షకు తలొగ్గి అప్పట్లో కాంగ్రెస్ సర్కార్ లోక్ పాల్ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఆ పార్టీ తీసుకొచ్చిన చట్టం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నది అన్నాహజారే వాదన.
బీజేపీ మ్యానిఫేస్టోలో పెట్టి....
బీజేపీ కూడా తన ఎన్నికల మ్యానిఫేస్టోలో సమర్థ లోక్ పాల్ బిల్లు తెస్తామని చెప్పింది. అయితే అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవినీతి ఎంత మాత్రం తగ్గలేదు. దీంతో మరోసారి సామాజిక కార్యకర్త అన్నాహజారే దీక్షకు దిగడం విశేషం. సమర్థ లోక్ పాల్ బిల్లును తేవాలన్నదే తన ముఖ్య డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారని, రైతు ప్రయోజనాలను ప్రభుత్వాలు రక్షించాలని కూడా ఆయన గట్టిగా కోరుతున్నారు.
చుట్టూ పోలీసులే....
కాగా అన్నాహజారే దీక్ష సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలుత రాజఘాట్ లో మహాత్మాగాంధీకి నివాళులర్పించిన అన్నాహజారే తన ముఖ్య అనుచరులతో కలిసి రామ్ లీలా కు వెళ్లి దీక్షను ప్రారంభించారు. అయితే అన్నాహజారేకు మద్దతుగా ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం కొన్ని రైళ్లను రద్దు చేయడం విమర్శలకు దారి తీసింది. తనకు ఎలాంటి పోలీసు రక్షణ అవసరం లేదని చెబుతున్నా పోలీసు బలగాలను మొహరించడం ఏంటని అన్నా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద అన్నా హజారే దీక్షతోనైనా ప్రభుత్వంలో కదలిక వస్తుందో లేదో చూడాలి మరి.