మోడీకి వ్యతిరేకంగా అందరూ ఒక్కటవుతున్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఉప ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీచేసి విజయం సాధించాయి. అదే ఊపుమీద వచ్చే ఎన్నికల్లో కూడా యూపీలో దుమ్ము లేపుదామన్న ఉద్దేశంతో అఖిలేష్ , మాయావతి ఉన్నారు. అయితే యూపీలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించింది. గత ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతిచ్చిన బీఎస్పీకి అండగా నిలవాలన్నది అఖిలేష్ నిర్ణయం.
రేపు రాజ్యసభ ఎన్నికలు....
ఉత్తరప్రదేశ్ లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్థానం ఖచ్చితంగా సమాజ్ వాదీ పార్టీకి దక్కుతుంది. ఎస్పీకి 47 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక్క రాజ్యసభ స్థానం దక్కించుకోవడానికి 37 మంది ఎమ్మెల్యేల సంఖ్య అవసరం. అయితే ఈ 37 మంది పోను మరో పది మంది ఎస్పీ సభ్యులు మాయవతి పార్టీకి మద్దతివ్వనున్నారు. యూపీలో మాయావతి పార్టీకి 19 మంది సభ్యులుండగా, ఎస్పీ పది మంది కలిస్తే 29 మంది అవుతారు. మాయావతికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుమంది, అజిత్ సింగ్ పార్టీ నుంచి ఒక సభ్యుడు మద్దతిస్తారని చెప్పడంతో బీఎస్పీ కూడా ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకునే అవకాశముంది.
ఎస్సీ ఎమ్మెల్యేలు కొందరు...
అయితే నిన్నటి వరకూ సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు దూరమవుతారన్న ఊహాగానాలు వచ్చాయి. అఖిలేష్ ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా వీరు డుమ్మా కొట్టడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే అఖిలేష్ బుధవారం ఏర్పాటు చేసిన విందుకు ఎస్పీకి చెందిన ఏడుగురు సభ్యుల హాజరవ్వడంతో అఖిలేష్ ఊపిరి పీల్చుకున్నారు. అమిత్ షా రంగంలోకి దిగారని, ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలను తమకు అనుకూలంగా బీజేపీ మలచుకుంటోందన్న వార్తలు అఖిలేష్ లో కొంత కంగారును పుట్టించాయి.
విందుకు అందరూ హాజరు....
అయితే రాజ్యసభ ఎన్నికలకు రెండు రోజుల ముందు అఖిలేష్ ఏర్పాటు చేసిన విందుకు అందరూ హాజరయ్యారు. విచిత్రమేమిటంటే ఈ సమావేశానికి ములాయాం సింగ్ తో పాటు ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ కూడా హాజరవ్వడం విశేషం. అఖిలేష్ తో ఆయన బాబాయ్ శివపాల్ యాదవ్ తీవ్రంగా విభేదించారు. యూపీ ఎన్నికలు ముగిసిన తర్వాత అఖిలేష్ ఉన్న ఛాయలకు కూడా శివపాల్ యాదవ్ రాలేదు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శివపాల్ యాదవ్ రావడంతో ఎస్పీ నేతలు, కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. మొత్తం మీద ఏడాది తర్వాత ములాయం కుటుంబం అంతా ఒక్కటయింది.