ఆమ్ ఆద్మీకి మరో పరీక్ష....!

Update: 2018-01-21 17:30 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ కి షాక్ తగిలింది. ఆప్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ఎన్నికల కమిషన్ పంపించిన నివేదికపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఓకే ముద్ర వేశారు. లాభదాయక పదవుల్లో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలనూ అనర్హులుగా ప్రకటిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఆమోదం తెలిపింది. నిన్న ఎన్నికల కమిషన్ పార్లమెంటరీ కార్యదర్శులుగా పనిచేసిన 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రపతికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

అనర్హత వేటు వేసిన రాష్ట్రపతి....

అయితే ఆదివారం రాష్ట్రపతి కార్యాలయం అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఢిల్లీ లో 20 అసెంబ్లీ స్థానాలకు తిరిగి ఎన్నికలకు జరగనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 అసెంబ్లీ స్థానాలుండగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 20 మంది రానున్న ఎన్నికల్లో ఓటమి పాలయినా ఆప్ సర్కార్ కు వచ్చే ఇబ్బంది ఉండదు. ఢిల్లీ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 35 మాత్రమే. ఇంకా 46 మంది ఎమ్మెల్యేల బలం ఆప్ కు ఉంది.

వారినే అభ్యర్థులుగా నిలపాలని....

అయితే ఎన్నికలు జరిగితే తిరిగి వారినే అభ్యర్థులుగా ప్రకటించి గెలిపించుకోవాలన్నది ఆప్ లక్ష్యంగా కన్పిస్తోంది. బీజేపీ సర్కార్ తమపై కుట్ర చేసిందన్నది ఆప్ ఆరోపణ. మమత బెనర్జీ లాంటి వారు కూడా ఆప్ కు అండగా నిలబడుతున్నారు. ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా తయారైందని విమర్శించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఢిల్లీలో ఉప ఎన్నికల వేడి రాజుకుంటుంది. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీకి అవసరంగా చెప్పొచ్చు.

Similar News