ఆమె వెళితే... అక్కడ లీడర్ లేరా?

Update: 2017-11-29 00:30 GMT

ఆమె మీద జగన్ కు అంత నమ్మకం. తెలుగుదేశం పార్టీ మీద అపరకాళిలా విరుచుకపడే గిడ్డి ఈశ్వరి పార్టీని వీడతారని వైసీపీ అధినేత జగన్ ఊహించనే లేదు. చంద్రబాబు తల నరకినా తప్పులేదన్న గిడ్డి ఈశ్వరి తన వెంటే నడుస్తుందనుకున్నాురు జగన్. అందుకే మన్యం వైపు వైసీపీ అధినేత పెద్దగా దృష్టి సారించలేదు. అన్నీ గిడ్డి ఈశ్వరికే అప్పగించారు. అందుకోసం పాడేరు నియోజకవర్గంలో కూడా ద్వితీయ శ్రేణి నేతలను ఎదిగే అవకాశమివ్వలేదు జగన్. అంత నమ్మకమున్న గిడ్డిఈశ్వరి పార్టీని వీడి వెళ్లిపోవడాన్ని జగన్ ఊహించలేకపోయారు. రెండు రోజుల క్రితం తన మద్దతు దారులతో కలిసి చంద్రబాబు సమక్షంలో గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పాడేరు నియోజకవర్గానికి పార్టీకి దిక్కుమొక్కూ లేకుండా పోయారు. ఏ నేత అక్కడ లేని పరిస్థితి నెలకొంది.

కొత్త నేత కోసం అన్వేషణ....

ప్రస్తుతం పాడేరు వైసీపీ కార్యాలయం బోసి పోయి ఉంది. గిడ్డి ఈశ్వరి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ జెండాను తొలగించారు. ఫ్లెక్సీలను చించివేశారు. గిడ్డి ఈశ్వరి పాడేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ...అరకు ఎంపీ గీత, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఆ ప్రాంతం మొత్తాన్ని జగన్ గిడ్డి ఈశ్వరికే అప్పగించారు. అరకు నియోజకవర్గంతో పాటు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా బాధ్యతలను చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గిడ్డిఈశ్వరికి వ్యతిరేకంగా సీనియర్ నేతలు పావులు కదపడంతో ఆమె జీర్ణించుకోలేకపోయారు. కుంభా రవిబాబును పార్టీలోకిచేర్చుకోవడాన్ని ఆమె బహిరంగంగానే తప్పుపట్టారు. జగన్ నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో తన దారి తాను చూసుకున్నారు. పాడేరులో అంతా తానే అయి వ్యవహరించిన ఈశ్వరి టీడీపీలోకి వెళ్లిపోవడంతో ఇప్పుడు అక్కడ నాయకత్వ లేమి కనిపిస్తోంది. ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఈశ్వరి వెంటనే వెళ్లిపోయారు. దీంతో కొత్తనేతలను అన్వేషించే పనిలో పడింది వైసీపీ. మాజీ మంత్రి బాలరాజు వస్తారని అనుకున్నా ఆయన ఎటూ తేల్చి చెప్పడం లేదు. దీంతో పాడేరు నియోజకవర్గ బాధ్యతలను మండల స్థాయి నేతలకు అప్పగించే యోచనలో వైసీపీ నేతలు ఉన్నారు. మొత్తం మీద గిడ్డి ఈశ్వరిని చూసుకుని అక్కడ రెండోస్థాయి నేతలను ఎదగనివ్వకపోవడంతో అక్కడ లీడర్ లేకపోవడం వైసీపీకి మన్యంలో పెద్ద దెబ్బేనంటున్నారు విశ్లేషకులు.

Similar News