ఆప్ ను దెబ్బకొట్టింది ఒక సామాన్యుడే...!

Update: 2018-01-20 18:29 GMT

సామాన్యుడు అనేది ఆ పార్టీ పేరులోనే ఉంది. అదే సామాన్యుడు ఆ పార్టీని దెబ్బకొట్టేశాడు. 31 ఏళ్ల యువన్యాయవాది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటానికి కారణం ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక సామాన్య వ్యక్తే. ఉత్తరప్రదేశ్ కుచెందిన ప్రశాంత్ పటేల్ న్యాయవాది. ఢిల్లీ సర్కార్ ను ఆమ్ ఆద్మీ పార్టీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే 2015 మార్చి 13న 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమిస్తూ కేజ్రీవాల్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రపతికి ఫిర్యాదు....

ఇది ప్రశాంత్ పటేల్ కు నచ్చలేదు. శాసనసబ్యులుగా ఉంటూ లాభదాయక పదవులను ఎలా పొందుతారని తనను తానే ప్రశ్నించుకున్నారు. అయితే అంతటితో ప్రశాంత్ పటేల్ ఆగలేదు. ఈ విషయం తెలిసినా నిశ్శబ్దంగా ఉండలేదు. 2015 జూన్ 19న న్యాయవాది ప్రశాంత్ పటేల్ వందపేజీలతో కూడిన ఫిర్యాదును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191, గవర్న మెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీఆఫ్ డిల్లీ యాక్ట్ 1991లోని సెక్షన్ ప్రకారం ఢిల్లీ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్న వారు లాభదాయక పదవిలో ఉంటే అతను అనర్హుడవుతారని ప్రశాంత్ పటేల్ తన అర్జీలో పేర్కొన్నారు.

సామాన్య వ్యక్తిగానే....

అయితే అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ మాత్రం పార్లమెంటరీ సెక్రటరీలను లాభదాయకమైన పదవుల నుంచి మినహాయిస్తూ ఢిల్లీ అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును రాష్ట్రపతికి పంపారు. అయితే రాష్ట్రపతి ఈ బిల్లును తిరస్కరించడమే కాకుండా, ప్రశాంత్ పటేల్ ఫిర్యాదును ఎన్నికల కమిషన్ పరిశీలనకు పంపారు. దీంతో ఇన్నాళ్లకు ఢిల్లీ ఎమ్మెల్యేలపై ఎన్నికల కమిషన్ చర్యలకు దిగింది. అయితే ప్రశాంత్ పటేల్ మాత్రం తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తినో అయితే ఈ ఫిర్యాదు చేసి ఉండేవాడిని కానేమో అని అన్నారు. తాను ఒక సామాన్య వ్యక్తిని కాబట్టే దీనిపై స్పందించగలిగానని చెప్పారు.

Similar News