ఆప్ కు షాక్ మీద షాక్...!

Update: 2017-11-09 18:29 GMT

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్... ఏడుగురు ఆప్ శాసనసభ్యులపై ఫోర్జరీ కేసు దాఖలయింది. వరుసగా వచ్చిపడుతున్న కష్టాలతో ఆమ్ ఆద్మీ పార్టీ కుదేలైపోతోంది. ఒకపక్క లెఫ్ట్ నెంట్ గవర్నర్ సహాయ నిరాకరణ, ఢిల్లీలో వాయు కాలుష్యం వంటి అంశాలతో ఇబ్బందులు పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మరో సమస్య వచ్చిపడింది. తన పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఫోర్జరీ చేశారని కేసు దాఖలయింది. యాంటీ కరప్షన్ కార్యకర్త రాహుల్ శర్మ ఈ కేసును దాఖలు చేశారు ఎన్నికల అఫడవిట్లలో ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు వాస్తవాలను చెప్పకుండా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని రాహుల్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏడుగురి ఎమ్మెల్యేలపై ఫోర్జరీ ఆరోపణ....

వీరిలో అనేకమంది ఎమ్మెల్యేలు కొన్ని కంపెనీలకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నాయని, అనేక కంపెనీల్లో షేర్లు కూడా ఉన్నాయని రాహుల్ శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవేవీ ఎన్నికల అఫడవిట్లో వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్న కుమార్ బిశ్వాస్ పేరు కూడా ఇందులో ఉండటం విశేషం. అయితే కేజ్రీవాల్ బిశ్వాస్ ను పక్కన పెట్టడానికే తాను మూడు రాజ్యసభ పదవులు నిపుణులకే కేటాయిస్తానని చెప్పారు. ఇందులో మాజీ ఆర్బీఐ రఘురామ్ రాజన్ పేరును ఆయన ప్రతిపాదించారు. అయితే రఘురామ్ రాజన్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. మొత్తం మీద కేజ్రీవాల్ సర్కార్ రోజుకో వివాదంలో చిక్కుకుంటోంది.

Similar News