ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల రగడకు ఫుల్ స్టాప్ పెట్టేయాలని భావిస్తోంది. రాజ్యసభకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళతారన్న ప్రచారాన్ని ఆ పార్టీ ఖండించింది. అయితే ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రస్తుతం అండమాన్స్ లో పర్యటిస్తున్నారు. వారు ఢిల్లీకి చేరుకోగానే ఆప్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇప్పటికే మూడు పేర్లను ఖరారు చేసింది. ఈపేర్లకు అరవింద్ కేజ్రీవాల్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
పార్టీలో తీవ్రమైన పోటీ....
ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు దక్కుతాయి. దీంతో ఆ పార్టీలో తీవ్రమైన పోటీనెలకొంది. ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ తాను రాజ్యసభకు వెళ్లాలని భావిస్తున్నారు. మరోనేత అశుతోష్ కూడా రాజ్యసభకు వెళ్లాలన్న తన అభిప్రాయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనికి పార్టీ అగ్రనాయకత్వం అంగీకరించలేదు. పోటీ తీవ్రంగా ఉండటంతో బయటనుంచి వివిధ సామాజిక వర్గాలకు రాజ్యసభ స్థానాలను ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
ఈ ముగ్గురికే అవకాశం....
ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మూడు పేర్లను సూచించినట్లు తెలుస్తోంది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సంజయ్ సింగ్, వాణిజ్యవేత్త, సామాజిక కార్యకర్త అయిన సుశీల్ గుప్తా, ఛార్టెడ్ అకౌంటెంట్ ఎన్.డి.గుప్తాల పేర్లను కమిటీ ఎంపిక చేసింది. ఈ ముగ్గురు పేర్లను అరవింద్ కేజ్రీవాల్ అండమాన్స్ నుంచి వచ్చిన తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై పరిశీలిస్తుంది. అయితే ఈ మూడు పేర్ల విషయంలో కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. మొత్తం మీద ఆప్ కు ఈ ఎంపిక ఒక సమస్యగా మారుతుంది.