ఆప్ కు ఎంత కష్టం...? ఎంత నష్టం?

Update: 2018-01-19 18:29 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు 20 మందిపై అనర్హత వేటు వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయ కక్షల కారణంగానే ఈ అనర్హత వేటు పడిందని ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగంగానే ఆరోపిస్తుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండటం కమలనాధులకు ఎప్పటి నుంచో కంటగింపుగా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వానికి సహకరించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. మరో వైపు లెఫ్ట్ నెంట్ గవర్నర్ పెత్తనంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు మార్లు సహనం కోల్పోవాల్సి వచ్చింది.

ప్రభుత్వానికి సహకరించడం లేదని....

ఆయన ప్రజాసంక్షేమ విషయాల్లోనూ సొంత నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు. ఇటీవల ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏర్పడినప్పుడు కూడా న్యాయస్థానం నుంచి అక్షింతలు వేయించుకోవాల్సి వచ్చింది. వాహనాల రాకపోకలపై సరి, బేసి విధానాన్ని ప్రవేశపెట్టినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఢిల్లీలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా ముందుకు సాగని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అరవింద్ క్రేజీవాల్ అనేకసార్లు మోడీసర్కార్ పై బహిరంగంగానే విరుచుకు పడ్డారు. తనను, తన ప్రభుత్వాన్ని బీజేపీ టార్గెట్ చేస్తోందని కూడా అనేకసార్లు ఆరోపించారు. అయితే 2015లో అరవింద్ కేజ్రీవాల్ 20 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. అయితే లాభదాయకపదవుల్లో ఎమ్మెల్యేలను నియమించడం చట్ట విరుద్ధమంటూ విపక్షాలు ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాయి.

రాజకీయ కక్షతోనేనా?

అయితే ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది శాసనసభ్యులున్నారు. ఇందులో 67 మంది ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన వారే. ఈ నేపథ్యంలో్ లాభదాయక పదవులు పొందారని ఎన్నికల కమిషన్ 20 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేసింది. దీనినిరాష్ట్రపతికి కూడా సిఫార్సు చేసింది. అయితే ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బలం ఇంకా ఆప్ కు ఉండటంతో ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చే ముప్పులేదు. అయితే ఇక్కట ట్విస్ట్ ఏంటంటే... కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకే జ్యోతి సోమవారం పదవీ విరమణ చేయనున్నారు. మరో మూడు రోజుల్లోపదవీ విరమణ చేస్తున్న సమయంలో ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపేనని ఆప్ చెబుతోంది. అయితే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆప్ నిర్ణయించింది. రాష్ట్రపతి ఎన్నికల కమిషన్ సిఫార్సును ఆమోదిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

ఆప్ అత్యవసర సమావేశం....

కాగా ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడటంపై కేజ్రీవాల్ తన నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా భయపడే ప్రసక్తి లేదని ఆప్ నేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు. అయితే అనర్హత వేటు పడిన వారిలో ద్వారక నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదర్శ శాస్త్రి, ఆల్కా లాంబా (చాందినీ చౌక్), అనిల్ వాజపేయి (గాంధీనగర్), అవతార్ సింగ్ (కాల్ కాజీ), కైలాశ్ గెహ్లట్ (నజాఫ్ గార్గ్), మదన్ లాల్ (కస్తుర్బా నగర్), మనోజ్ కుమార్ (కోండ్లి), నరేశ్ యాదవ్ (మోహరౌలి), నితిన్ త్యాగి (లక్ష్మీ నగర్), జర్నల్ సింగ్ (తిలక్ నగర్), ప్రవీణ్ కుమార్ (జాంగ్ పురా), రాజేశ్ గుప్తా (వజీర్ పూర్), రాజేశ్ రిషి (జానక్ పురి), సంజీవ్ ఝా (బురారి), సరితా సింగ్ (రోహతాస్ నగర్), సోమదత్ (సదర్ బజార్), శరద్ కుమార్ (నెర్లా), శివచరణ్ గోయల్ (మోతినగర్), సుఖ్ బీర్ సింగ్ (మందకా) విజేందర్ గార్గ్ (రాజేందర్ నగర్) అనర్హత వేటు పడిన వారిలో ఉన్నారు.

Similar News