ఆన్నాడీఎంకేను అష్టదిగ్భంధనం చేస్తున్నారే...!

Update: 2017-12-16 18:29 GMT

అర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికార పార్టీని దెబ్బకొట్టాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. జయలలిత మరణించడంతో ఆర్కేనగర్ ను కైవసం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే సత్తాను చాటాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది. ఇందుకోసం అధికారపార్టీని ఊపిరి తీసుకోనివ్వకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తూ, ఎన్నికల కమిషన్లకు ఫిర్యాదు చేస్తూ అన్నాడీఎంకేను ఇబ్బంది పెడుతోంది. దీంతో అధికార పార్టీకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. జయలలిత మరణించిన తర్వాత డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆర్కే నగర్ పై కన్నేశారు. రాష్ట్రంలో జయలలిత ఉన్నప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. ఇప్పుడు అన్నాడీఎంకే చీలికలు, పీలికలయింది. నాయకత్వ సమస్య ఆ పార్టీని వెన్నాడుతోంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి స్టాలిన్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫిర్యాదులు....పిటిషన్లు....

ఆర్కేనగర్ లో తన అభ్యర్థిగా మరదు గణేశ్ ను డీఎంకే బరిలోకి దింపింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే స్టాలిన్ ఆర్కే నగర్ లో పర్యటిస్తూ అధికార పార్టీ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు ఆర్కేనగర్ లో బోగస్ ఓట్లపై పెద్దయెత్తున ధ్వజమెత్తారు. అధికార పార్టీ కావాలని బోగస్ ఓట్లు చేర్చిందని, వాటిని తొలగించాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ దాదాపు 45 వేల బోగస్ ఓట్లను తొలగించింది. అయినా ఇంకా మరో ఐదు వేల బోగస్ ఓట్లు ఉన్నాయంటూ మరోసారి మద్రాస్ హైకోర్టు తలుపుతట్టారు. ఇందులో కూడా డీఎంకే విజయం సాధించింది. ఆ ఐదు వేల బోగస్ ఓటర్లను పోలింగ్ లో పాల్గొనకుండ చూడాలని ఎన్నికల కమిషన్ మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దీంతో పాటు ఓఖా తుఫాను దెబ్బకు తమిళనాడులోని మత్స్యకారులందరూ తీవ్రంగా నష్టపోయారు. దీనిపై ప్రభుత్వ వైఫల్యాన్ని డీఎంకే ఎండగడుతూ వస్తుంది. ఇక అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుచేసి మొత్తం 11 మంది పోలీస్ అధికారులను అక్కడి విధుల నుంచి తప్పించగలిగింది. ఇలా డీఎంకే అధికార పార్టీని అష్టదిగ్భంధనం చేస్తోంది. అలాగే ఆర్కే నగర్ లో షాడో టీంలను ఏర్పాటు చేసి నగదు పంపిణీ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. డీఎంకేకు మిత్రపక్షాలన్నీ మద్దతిస్తుండటంతో గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తుంది. మరి ఆర్కే నగర్ ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందో?

Similar News