నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం సోదరులది ప్రత్యేక స్టయిల్. అయితే గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఆనం సోదరులు ఇప్పుడు మళ్లీ కొంత గాడిలో పడినట్లు కన్పిస్తోంది. ఆనం వివేకానందరెడ్డి మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. కాని ఆయన సోదరుడు రామనారాయణరెడ్డి మాత్రం పట్టువదలకుండా శ్రమిస్తూనే ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న రామనారాయణరెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు బయలుదేరే ముందు ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తమ రాజకీయ భవిష్యత్ పై క్లారిటీ తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేరోజు బుట్ట రేణుక కూడా టీడీపీకి మద్దతు ఇచ్చిన సభలో కూడా రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆనం రామనారాయణరెడ్డి చంద్రబాబుతో కొంత వివరంగా మాట్లాడినట్లు తెలిసింది.
టిక్కెట్ గ్యారంటీయేనా?
అయితే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాల్లో అప్పటికే అక్కడ ఉన్న ఇన్ ఛార్జి కన్నబాబు ప్రత్యేకంగా చేపడుతున్న విషయాన్ని కూడా ఆనం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. తాను నియోజకవర్గంలో పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నా కన్నబాబు పార్టీ శ్రేణుల్లో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, ఇది తనకు ఇబ్బందిగా మారిందిని చెబుతున్నారు. తాను ఇన్ ఛార్జిగా జన్మభూమి కమిటీలను నియమించినా... వాటిపై కోర్టులకెక్కడానికి కారణం కన్నబాబేనని ఆనం ఫిర్యాదు చేశారు. తనకు, తన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి పట్ల జిల్లాకు చెందిన మంత్రులు కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆనం వాపోయారట. ఆనం గోడును విన్న చంద్రబాబు తాను విదేశాల నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని, వచ్చే ఎన్నికల్లో సోదరులిద్దరికీ టిక్కెట్లు గ్యారంటీ అని చెప్పి వెళ్లిపోయారట. దీంతో ఆనం సోదరుల్లో కొంత ఉత్సాహం నెలకొంది. చంద్రబాబు విదేశాల నుంచి వచ్చిన వెంటనే ఆనం సోదరులు మరోసారి కలవాలని నిర్ణయించుకున్నారు.