నెల్లూరులో ఆనం ఆధిపత్యానికి గండిపడింది. రాచరికపు ఆనవాళ్లకు ఇది సజీవ సాక్ష్యం. నెల్లూరులో విఆర్ కాలేజీ అంటే అందరికీ సుపరిచితమే. దీనికి ఎనభై ఏళ్ల చరిత్ర ఉంది. విఆర్ కళాశాలకు ఆనం కుటుంబీకులకు విడదీయరాని సంబంధం ఉంది. వెంకటగిరి రాజాస్ కళాశాలను విద్యావ్యాప్తి కోసం ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. అప్పట్లోనే దీనికి నిధులు కేటాయించి నిర్మాణాలు చేపట్టారు. విఆర్ విద్యాసంస్థలంటే కోస్తా జిల్లాలోనే పేరు. ఇక్కడ సీటు దొరకడమంటే ఒకప్పుడు జాక్ పాట్ కొట్టినట్లే.ఇక్కడ చదివిన ఎందరో ఉన్నతస్థానాలను అధిరోహించారు. బెజవాడ గోపాలరెడ్డి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరకూ ఇక్కడ అక్షరాలు దిద్దిన వారే. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈకళాశాల విద్యార్థి కావడం గమనార్హం. అయితే ఈ కళాశాలలో ఆనం కుటుంబం మూదు దశాబ్దాల క్రితం ప్రవేశించింది. 1986లో వెంకటగిరి రాజాలు పెట్టిన నిబంధనలను మార్చేసి కళాశాల యాజమాన్య బాధ్యతలను చేజిక్కించుకుంది.
వీఆర్ కళాశాల నిధుల వినియోగంపై.....
మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఈ కళాశాల యాజమాన్య బాధ్యతలను చూస్తున్నారు. అయితే అనేకమంది దీనిపై అనేకమంది అభ్యంతరం చేస్తూ వస్తున్నారు. దీనిపై పోరాటం కూడా చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు దీనిపై కమిటీ వేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక్కడ ఏబీవీపీ విద్యార్థులుగా ఉన్న ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఆమంచర్ల శంకరనారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఆనం యాజమాన్య హక్కులపై పోరాటం చేశారు. అయినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు కాలేదు. దీంతో ఛార్టెడ్ అకౌంటెంట్ ఆమంచర్ల శంకర్ నారాయణ న్యాయపోరాటానికి దిగారు. జిల్లా కోర్టును ఆశ్రయించారు. 1993 జూన్ లో శంకర్ నారాయణకు వ్యతిరేకంగా జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. 1986లో జరిగిన విఆర్ కళాశాల కమిటీ ఎన్నికల్లో ఆనం ఎన్నిక సబబేనని తీర్పునిచ్చింది. దీనిపై శంకరనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 6వ తేదీన విఆర్ కళాశాలలో ఆనం పెత్తనం చెల్లదంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. అయినా ప్రభుత్వం మాత్రం ఈ తీర్పును అమలుపర్చలేదు. ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. వీఆర్ ఎయిడెడ్ కళాశాలకు ఆనం వివేకానందరెడ్డి కరస్పాండెంట్. ఈ కళాశాలలో నెలకు కోటి యాభై లక్షలు జీతాల రూపంలో డ్రా చేస్తున్నారు. దీనిపై మరోసారి ఆమంచర్ల శంకర్ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఏడు నెలల తర్వాత హైకోర్టు మరోసారి తన తీర్పును ప్రకటించింది. చట్టబద్ధత లేని కమిటీకి జీతాలు చెల్లించడం, నిధులు డ్రా చేసే హక్కు లేదని స్పష్టం చేసింది. దీంతో ఆనం వివేకాకు వీఆర్ కళాశాలతో ఉన్న అనుబంధం తెగిపోయినట్లే. ఇప్పుడు నిధులు డ్రా చేసే వీలులేదు. ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.